డోర్నకల్, నవంబర్ 2 : డోర్నకల్ మండలం ముల్కలపల్లి శివారులోని ఆకేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం హామీలకే పరిమితమైంది. స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్ బ్రిడ్జిని పరిశీలించి, త్వరలోనే నిర్మిస్తామని హామీ ఇచ్చి మరిపోయారు. గతేడాది సెప్టెంబర్ ఒకటిన వచ్చిన వరదల ధాటికి ఆకేరువాగుపై బ్రిడ్జి కొట్టుకుపోయి, వాగు పరివాహక ప్రాంతాలు ముల్కలపల్లి, మోదుగుగడ్డ తండా, దుబ్బగడ్డ తండాల్లో భారీ ఆస్తి, పంట నష్టం జరిగింది.
ఆ సమయంలో కొట్టుకుపోయిన బ్రిడ్జిని, పంటలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, స్థాని క ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్ పరిశీలించారు. వరద బాధితులు, రైతులతో మాట్లాడారు. ఆకేరు వాగుపై కొట్టుకుపోయిన బ్రిడ్జి త్వరలోనే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఏడాది గడిచిపోయినా బ్రిడ్జిని పరిశీలించిన నాథుడే కరువయ్యారు. ఇంతకాలం పాత బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలు కొనసాగించారు. ప్రస్తుత ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్ ఏ రోజూ కూడా బ్రిడ్జిని పరిశీలించలేదు. సీఎం రేవంత్‌రెడ్డి దగ్గర మాట కూడా విప్పలేదు.
ప్రజలు ఇబ్బంది పడుతున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల రాకపోకలకు ఇదే ప్రధా న రహదారి. మొంథా తుపాన్ ప్రభావంతో ఈ నెల 28న ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు రాక పోకలు అధికారులు నిలిపివేశారు. ఇప్పటికి నాలు గు రోజులు గడిచినా పట్టించుకునే వారులేరు. పాత బ్రిడ్జి నుంచి భారీ వాహనాలు వెళ్లడం లేదు. అవి వెళ్తే కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక మంత్రులు, ఎమ్మెల్యే పై స్పందించి ఆకేరువాగుపై బ్రిడ్జిని నిర్మించాలని వేడుకుంటున్నారు.