కారేపల్లి : మొంథా తుఫాన్ తో చేతికి వచ్చిన పంట తుడిచిపెట్టకపోయిందని, తుఫాన్ బాధిత రైతులకు కేంద్ర, రాష్ట్రాలు భరోసా కల్పించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో పంటలను జాన్‌వెస్లీ నాయకత్వంలో సీపీఐ(ఎం) బృందం పంటలను పరిశీలించారు. ఈసందర్బంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ తెలంగాణలో 10 జిల్లాలో తుఫాన్‌తో పంటలు తీవ్ర నష్టపోయాయన్నారు. తుఫాన్‌తో వీచిన గాలులు, వర్షానికి పంట పోలాలు నీటిలో మునగటం, నేలవారటం జరిగిందన్నారు. రాష్ట్రంలో తీతకు వచ్చిన పత్తి పంట చేనులోనే వర్షానికి తడిసి ముద్దైందన్నారు. రాష్ట్రంలో 30 వేల ఎకరాలలో వరి పంటకు నష్టం వాటిల్లిందన్నారు. తుఫాన్‌తో రైతులు అతులాకుతలం అవుతున్న కేంద్ర,రాష్ట్ర పాలకులు నేటికి స్పందించక పోవటంతో విచారకరమన్నారు.
రాష్ట్రం ప్రభుత్వం పంట నష్టంపై విచారించి కేంద్రానికి నివేధిక పంపాలన్నారు. కేంద్రం ప్రభుత్వం రైతుల విషయంలో తాత్సర్యం చేయకుండా వెంటనే ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇచ్చేలా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వర్షానికి తడిసి పంటలను మార్కెట్ రేటు ప్రకారం కొనుగోలు చేసి రైతు మనోధైర్యం చెడకుండా చూడాలన్నారు. తుఫాన్ నష్టంపై సరిగా స్పందించకుంటే బాధితులతోపాటు , రైతులను సమీకరించి అందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు అబ్బాస్, రమావత్ శ్రీరాంనాయక్, స్కైలాబ్‌బాబు, ఎర్ర శ్రీనివాసరావు, మెరుగు రమణ, నవీన్‌రెడ్డి, మండల కార్యదర్శి కే.నరేంద్ర, నాయకులు కరకపల్లి రాయమల్లు, రావూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.