కడ్తాల్, ఆగస్టు 29 : రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని సీపీఏం మండల నాయకుడు గుమ్మడి కురుమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రంగారెడ్డ జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రానికి సంబంధించిన గోదాంను ఆయన పరిశీలించారు. గోదాం వద్దకు యూరియా కోసం వచ్చిన రైతులను అడిగి ఆయన సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానకాలం సీజన్ కంటే ముందే రైతులు సాగే చేసే పంటల విస్తీర్ణం అంచనా వేసి, సరిపడా యూరియాను అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.
మండలంలో బడా రైతులకు అధిక మొత్తంలో యూరియాను పంపిణీ చేస్తూ..చిన్న, సన్నకారు రైతులను రోజుల తరబడి గోదాం చుట్టు తిప్పుతూ ఒకటి, రెండు బస్తాలను పంపిణీ చేస్తున్నట్లు రైతులు వాపోతున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణితోనే యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి అన్నదాతలకు సరిపడా యూరియాను పంపిణీ చేయాలని, లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున్న ఆందోళన కార్యక్రమాలను చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు రూప్లానాయక్, దామోదర్, కృష్ణయ్య, శ్రీనివాస్, శేఖర్, కుమార్, వరలక్ష్మీ, మంజుల, నర్సమ్మ, జగినీ తదితరులు పాల్గొన్నారు.