మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 3 : కాంగ్రెస్ పార్టీ నమ్మించి గొంతు కోసిందని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ్ సారధి అన్నారు. ఈ మేరకు ఆయన స్థానిక నాయకులతో కలిసి మంగళవారం మహబూబాబాద్ పట్టణంలోని నామినేషన్ ఉపసంహరణ కేంద్ర వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో కష్టపడి ఎమ్మెల్యే మురళీనాయక్ను భారీ మెజార్టీతో గెలిపించినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయని, ఈ క్రమంలో అనేకసార్లు సీఎం ప్రధాన సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యే మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమతో చర్చించినట్లు తెలిపారు.
సీపీఐకి మున్సిపాలిటీలో 10 నుంచి 12 సీట్లు ఇస్తామని చెప్పుకుంటూ వచ్చారని, నిన్నటి వరకు కూడా సీట్లలో సమన్యాయం ఉంటుందని చెప్పి, తీరా ఉపసంరహణ చివరి నిమిషంలో సీపీఐతో పొత్తు ఉండదని చెప్పడం దుర్మార్గమని పేర్కొన్నారు. చర్చల పేరిట కాంగ్రెస్ నాయకులు సమయం వృథా చేశారని, కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలన్నారు. ఎమ్మెల్యే మురళీనాయక్ డౌన్ డౌన్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. సీపీఐ నాయకులంతా ఏకమై కాంగ్రెస్ పార్టీ వార్డ్ సభ్యులను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారధి, పెరుగుకుమార్, నవీన్, వెంకన్న, ఫాతిమా పాల్గొన్నారు.