సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు- 2026 ముసాయిదా ప్రజల ప్రయోజనాలను, స్థానిక సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉందంటూ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఫోరం కన్వీనర్ ఎం.శ్రీనివాస్ బుధవారం రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖకు లేఖ రాశారు. 271 పేజీల సుదీర్ఘ ముసాయిదాపై సమగ్ర చర్చ జరగడానికి అభిప్రాయ సేకరణ గడువును మరో 60 రోజులు పొడిగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రధాన అభ్యంతరాలు ఇవీ..
గడువు పెంచాలి
271 పేజీలకు పైగా ఉన్న ఈ సుదీర్ఘ బిల్లును అధ్యయనం చేసి అభిప్రాయాలు తెలియజేయడానికి ప్రభుత్వం ఇచ్చిన 20 రోజుల సమయం ఏమాత్రం సరిపోదని శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, పట్టణ నిపుణులు విసృ్తతంగా చర్చించేందుకు అభిప్రాయ సేకరణ గడువును కనీసం మరో 60 రోజులు పొడిగించాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల స్వయంప్రతిపత్తిని కాపాడేలా, ప్రజలపై భారాలు తగ్గించేలా బిల్లులో తగిన సవరణలు చేయాలని అర్బన్ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.