నల్లగొండ: రాష్ట్రంలో పండించిన వడ్లను కొనాల్సిన కేంద్రం మొండి వైఖరితో రైతులను ఇబ్బందులు పెట్టిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కావడం, రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారన్నారు. నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు చేస్తున్నందుకుగాను రైతులందరి పక్షాన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తామె మెడలు వంచి రాష్ట్రంతో ధాన్యాన్ని కొనేలా చేశామనే నైతిక హక్కు బీజేపీ నాయకులకు లేదన్నారు.
జాతీయ పార్టీలకు ఇప్పటికి అయిన కనువిప్పు కలగాలని, దేశంలో ఉన్న పరిస్థితిలు గమనించాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీలు ఓట్ల రాజకీయలను మానుకొని ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడితే బాగుంటుందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు ధాన్యం రాకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం హర్షించదగిన విషయమన్నారు.