Copper wire | జహీరాబాద్, ఏప్రిల్10 : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం అమీరాబాద్ గ్రామ శివారులోని మంజీరా నది ఒడ్డున ఏర్పాటుచేసిన ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ లో 65 హెచ్‌పీ పంప్ సెట్ మోటార్‌ను గుర్తుతెలియని వ్యక్తులు పగలగొట్టి కాపర్ వైర్లు దొంగిలించుకెళ్లారు.
స్థానిక గ్రామస్తుల కథనం ప్రకారం.. గత రెండు రోజులు క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ షెటర్లు పగలగొట్టి అందులోకి ప్రవేశించారు. నీటిని పంపిణీ చేసేందుకు వినియోగించే 65 హెచ్ మోటారును క్రేన్ సాయంతో పైకి లేపి మోటారు విడిభాగాలను తొలగించి అందులోని విలువైన కాపర్ వైర్లను తీసుకొని, మోటారు విడిభాగాలను మంజీరా నది సమీపంలో పడేసి వెళ్లిపోయారు.
ఎత్తిపోతల పథకం సమీపంలో వ్యవసాయం చేస్తున్న కొందరు రైతులు అటు వెళ్లగా.. ఈ దొంగతనం విషయం బయటకు వచ్చింది. దొంగిలించిన కాపర్ వైర్ దాదాపు 20060 కిలోల వరకు ఉంటుందని, కాపర్ వైర్ విలువ రెండున్నర లక్షల వరకు ఉంటుందని తెలిసింది. ఈ దొంగతనం విషయాన్ని గ్రామస్తులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఇవాళ సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు అమీరాబాద్ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. పంప్ హౌస్ లో విలువైన పంప్ సెట్ మోటారు, ఇతర పరికరాలు చోరీ కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. అనంతరం హద్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.