రుద్రంపూర్, జూలై 21 : ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించిన కార్పొరేట్ మెడికల్ బోర్డు ఫలితాలపై పునఃసమీక్ష చేపట్టి బాధిత కార్మికులకు న్యాయం చేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ.ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ పిలుపు మేరకు మంగళవారం సింగరేణి వ్యాప్తంగా అన్ని మైన్స్, విభాగాల్లో వినతిపత్రాలు సమర్పించారు. పిలుపులో భాగంగా కొత్తగూడెం ఏరియాలోని అన్ని గనులు, విభాగాల్లో ఏఐటీయూసీ నాయకులు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరేణి వ్యాప్తంగా సుమారు 2 వేల మంది కార్మికులు ఏళ్ల తరబడి మెడికల్ బోర్డు కోసం ఎదురు చూస్తుండగా, కేవలం 120 మందికి మాత్రమే బోర్డు నిర్వహించడం అన్యాయమని పేర్కొన్నారు.
వారిలో 28 మంది కార్మికులకు మెడికల్ బోర్డుకు హాజరుకావాల్సిన సమాచారం కూడా సకాలంలో అందకపోవడం యాజమాన్య నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. హాజరైన 120 మంది కార్మికుల్లో కేవలం 24 మందిని మాత్రమే ఇన్వాలిడేషన్కు అర్హులుగా ప్రకటించడం గతంలో నిర్వహించిన మెడికల్ బోర్డులతో పోలిస్తే అత్యంత తక్కువ శాతమని తెలిపారు. బొగ్గు గనుల్లో ముఖ్యంగా అండర్‌గ్రౌండ్‌లో దశాబ్దాలుగా పని చేస్తున్న కార్మికులు కీళ్ల నొప్పులు, వెన్నెముక సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు తదితర తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, వాటిని సమగ్రంగా పరిగణనలోకి తీసుకోకుండా ఫలితాలు ప్రకటించడం వల్ల నిజంగా అనారోగ్యంతో ఉన్న కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కావున గతంలో దరఖాస్తు చేసుకుని ఇప్పటికీ మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తున్న కార్మికులందరికీ తక్షణమే మరోసారి కార్పొరేట్ మెడికల్ బోర్డు నిర్వహించాలని, ప్రతి కార్మికుడి ఆరోగ్య పరిస్థితిని నిష్పాక్షికంగా పరిశీలించి అర్హులైన వారిని ఇన్వాలిడేషన్ చేసి, వారి వారసులకు ఉద్యోగాలు కల్పించి కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని యాజమాన్యాన్ని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సహాయ కార్యదర్శి గట్టయ్య, ఉపాధ్యక్షుడు కత్తర్ల రాములు, ఆఫీస్ బ్యారర్స్ సందబోయిన శ్రీనివాస్, హీరాలాల్, కర్రు రమేష్, గుమ్మడి వీరయ్య, పిట్ కార్యదర్శిలు ఏం ఆర్ కే ప్రసాద్, మధు కృష్ణ, కమల్, సురేందర్, నాయకులు రాజాలపూడి సాంబమూర్తి, బండారి మల్లయ్య, సాయి పవన్, సందీప్, శశివర్దనరెడ్డి, సురేంద్రరెడ్డి, వెంకటరమణ, కుమార్ రావు, మురళి, అప్పారావు, కొవ్వూరు రాజేశ్వరరావు, అవినాష్, గావిని నాగరాజు, సుబ్రమణ్యం, మెంగన్ రవి, కోటి, ఓం ప్రకాష్ పాల్గొన్నారు.

కార్పొరేట్ మెడికల్ బోర్డు ఫలితాలపై పునఃసమీక్ష చేయాలి : ఏఐటీయూసీ