Street Vendors | మిర్యాలగూడ, మార్చి 1 : మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్డులో వీధి దుకాణాలను ఇతర ప్రదేశాలకు తరలించేందుకు అన్ని రాజకీయ పక్షాలు, నాయకులు సహకరించాలని సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజులు కోరారు.
ఇవాళ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వీధి దుకాణదారులు మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణంలో రోజురోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని.. దీనిని అరికట్టేందుకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న వీధి దుకాణదారులను ఇతర ప్రదేశాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఇప్పటికే పలుచోట్ల వీధి విక్రయదారుల కోసం స్థలాలను ఎంపిక చేశామని తెలిపారు. ఈ స్థలాలను విక్రయదారులు, నాయకులు అంతా కలిసి పరిశీలించి వారికి అనుకూలమైన ప్రదేశానికి తరలి వెళ్లేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు.
మిర్యాలగూడ పట్టణానికి ఉన్న ఒక ప్రధానమైన రోడ్డు సాగర్ రోడ్డు అని.. దీనికి ఇరువైపులా వీధి విక్రయదారులు ఉండటం వల్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందన్నారు.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని.. వీరందరినీ ఇతర ప్రదేశాలకు తరలించి వారికి ఉపాధి మార్గాలు ఎప్పటిలాగే ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో సీఐలు నాగార్జున, వీరబాబు, తహసీల్దార్ హరిబాబు, ఎంపీడీవో శర్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Nidamanur | కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. పదిమంది మహిళలకు గాయాలు