నల్లగొండ, ఆగస్టు 13 : బాలికపై జరిగిన అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి 25 ఏండ్ల కారాగార శిక్ష విధిస్తూ నల్లగొండ జిల్లా పోక్సో న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. 30 మే 2020 న మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ పై జరిగిన అత్యాచారం కేసులో న్యాయస్థానం నేడు తీర్పును వెలువరించడం జరిగింది. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. 30 మే 2020 రోజున మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ కు చెందిన నిందితుడు మహమ్మద్ జాకీర్ బాబాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. నిందితుడు సదరు బాలికను సామాజిక మాధ్యమాల్లో పరిచయం ఏర్పరచుకుని మిర్యాలగూడెం వచ్చి బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అత్యాచారం చేయడం జరిగిందని ఆరోపణ.
ఇట్టి కేసులో విచారణ అనంతరం ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ బలమైన వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం సదరు వ్యక్తిని దోషిగా తేల్చుతూ 366(2)(i) కిడ్నాప్ కింద 5 సంవత్సరాలు, సెక్షన్ 3 & 4 ఫోక్స్ యాక్ట్ 2012 కింద 20 సంవత్సరాల కారాగార శిక్ష, మొత్తంగా 25 సంవత్సరాల కారాగార శిక్షను పోక్సో న్యాయస్థానం న్యాయమూర్తి విశ్వనాధ్ కులకర్ణి దిలీప్ రావు విధించడం జరిగింది. అలాగే బాధిత బాలికకు రూ.5 లక్షల కంపెన్సేషన్ న్యాయస్థానం ప్రకటించింది. అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ డి.శ్రీనివాస్ రెడ్డి, సీడీఓ బి.అఖిల్, భరోసా లిగల్ ఆఫీసర్ మామిడి కల్పన తదితర అధికారులు కేసు విచారణలో తోడ్పాటు అందించారు.