మోర్తాడ్/నిజాంసాగర్, ఆగస్టు 3: ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులకు వరద కొనసాగుతున్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన ఇన్ఫ్లో క్రమంగా తగ్గుతున్నది. ఎస్సారెస్పీలోకి సోమవారం ఉదయం 24,784 క్యూసెక్కుల వరద రాగా, సాయంత్రానికి 5,026 క్యూసెక్కులకు పడిపోయింది.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091అడుగులు (80.5 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1,075.10 అడుగుల (33.137 టీఎంసీలు)నీటి నిల్వ ఉన్నది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి పెద్దగా వానల్లేక చెప్పుకోదగ్గ స్థాయిలో ఇన్ఫ్లో రాలేదు. అయితే, భారీ వర్షాల కారణంగా ఈ సీజన్లో శనివారం అత్యధికంగా 85 వేల క్యూసెక్కులకు పైగా వరద వచ్చింది.
నిజాంసాగర్ ప్రాజెక్టుకు వారం క్రితం మొదలైన ఇన్ఫ్లో కొనసాగుతున్నది. 2,550 క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీ)లకు గాను ప్రస్తుతం 1,397.00 అడుగుల (8.242 టీఎంసీల) నీరు నిల్వ ఉందని ఏఈఈ సాకేత్ తెలిపారు.