హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలకులు ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజమని ప్రజలను భ్రమింపజేస్తున్నారు. అవే అబద్ధాలు.. అవే అభాండాలను పదేపదే వల్లిస్తున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద నిర్మించిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) భూ నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలిచ్చే కార్యక్రమాన్ని కూడా అసత్యాలు వల్లించేందుకు వేదిక చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని మరోసారి నిందలు మోపారు. వాస్తవాలను మరిచి విమర్శలు గుప్పించారు.
అబద్ధం : గత పాలకులు యాదాద్రి పవర్ ప్లాంట్ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. బీహెచ్ఈఎల్తో సమీక్షించలేదు.
నిజం : ఇది శుద్ధ అబద్ధం. యాదాద్రి పవర్ ప్లాంట్ పనులను 2017 అక్టోబర్ 17న చేపట్టారు. నవరత్న కంపెనీ అయిన బీహెచ్ఈఎల్ సంస్థ ప్రతినిధులతో కేసీఆరే స్వయంగా భేటీ అయ్యారు. జెన్కో, భెల్ మధ్య లెటర్ ఆఫ్ ఇండెంట్ (ఎల్వోఐ) కేసీఆర్ సమక్షంలోనే కుదిరింది. ఈ ప్లాంట్ నిర్మాణం కోసం తొలి విడతగా రూ. 417.16 కోట్ల చెక్కును స్వయంగా కేసీఆరే భెల్ ప్రతినిధులకు అందజేశారు. గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్ఈసీ) రూ. 16,070 కోట్ల ప్రోత్సాహకాన్ని మంజూరు చేయగా, ఆర్ఈసీ సీఈవో రాజీవ్‌శర్మ నుంచి స్వయంగా కేసీఆరే స్వీకరించారు. ఈ ప్లాంట్‌కు సాక్షాత్తు కేసీఆరే శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పలుమార్లు విద్యుత్తు అధికారులతో సమీక్షించారు. 2022 నవంబర్ 29న దామరచర్లలో పర్యటించి ప్లాంట్ నిర్మాణాన్ని పరిశీలించారు.
అబద్ధం : వేలకోట్ల పెట్టుబడితో ప్రారంభించిన పరిశ్రమ ఆలస్యమైన కారణంగా రాష్ట్ర ప్రజలపై ఆర్థికభారం పడింది.
నిజం : వైటీపీఎస్‌కు శంకుస్థానప చేసిన తర్వాత కరోనా కష్టాలు ఈ ప్లాంట్‌ను వెంటాడిన విషయం తెలియనిది కాదు. పనులు పుంజుకుంటున్న సమయంలో అత్యంత వేగంగా నిర్మాణం సాగుతున్న సమయంలో కరోనా దెబ్బకొట్టింది. లాక్డౌన్, కరోనా మొదటి, రెండో వేవ్‌లతో కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఛత్తీస్‌గఢ్, బెంగాల్, బీహార్, జార్ఖండ్ నుంచి 10వేల మంది కార్మికులు ఈ ప్లాంట్ నిర్మాణంలో పనిచేయగా, కరోనాతో వీరంతా అర్ధాంతరంగా సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఆ తర్వాత కార్మికులను రప్పించి పనులు వేగవంతం చేశారు.
అబద్ధం : 2022 అక్టోబర్‌లో ఎన్జీటీలో పర్యావరణ అనుమతులపై స్టే ఇచ్చింది. స్టేను ఎత్తివేసే దిశగా చర్యలు చేపట్టలేదు.
నిజం : ఈ ప్లాంట్‌ను అడ్డుకునే కుతంత్రాలకు కొదవేలేదు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టినా ముంబైకి చెందిన సంస్థ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో కేసు వేయడంతో కథ మొదటికొచ్చింది. 64శాతం నిర్మాణం పూర్తయిన తర్వాత మళ్లీ అధ్యయనం చేయాలంటూ ఎన్జీటీ తీర్పునిచ్చింది, ప్లాంట్ నిర్మాణం పూర్తయినా ఉత్పత్తి చేయవద్దని తీర్పునిచ్చింది. అప్పట్లోనే బీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, బడుగుల లింగయ్యయాదవ్, దీవకొండ దామోదర్‌రావులు కేంద్ర పర్యావరణ శాఖ అదనపు కార్యదర్శి తన్మయ్కుమార్ను కలిసి పర్యావరణ అనుమతులు మంజూరుచేయాలని కోరారు. దీంతో కేంద్ర విద్యుత్తుశాఖ కార్యదర్శి అలోక్‌కుమార్ 2023 మే 11న కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి లీనా నందన్‌కు ఓ లేఖ రాశారు. పర్యావరణ అనుమతుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విద్యుత్తు రంగంపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. భారీ తప్పిదాలు, అక్రమాలు జరిగాయని ఆరోపించింది. విద్యుత్తు ఒప్పందాలు, వైటీపీఎస్, బీటీపీఎస్ నిర్మాణంపై విచారణ సంఘాలను నియమించింది. జస్టిస్ నర్సింహారెడ్డి విచారణ దశలోనే కమిషన్ చైర్మన్ పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ తర్వాత జస్టిస్ మదన్ బీ లోకూర్ కమిషన్‌ను నియమించగా, ఇది విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో ఏముంది అన్నది ఎవరికీ తెలియదు. ప్రభుత్వం బయటపెట్టడంలేదు. మొత్తంగా కథ పరిసమాప్తమైంది. వాస్తవానికి తప్పే జరిగి ఉంటే అక్రమాలు, కుంభకోణం జరిగినట్టు విచారణలో తేలితే ఎన్ని నిందలేసేవారో, ఎంత హడావుడి చేసేవారో మనకు తెలియనిది కాదు. కానీ నివేదికపై క్యాబినెట్లో చర్చ జరిగిన తర్వాత కూడా సర్కారు వర్గాలు కిమ్మనడం లేదంటేనే, ఏం లేదని అర్థం. వాస్తవానికి యాదాద్రి పవర్ ప్లాంట్ కేసీఆర్ కలల ప్రాజెక్ట్. రాష్ట్ర భవిష్యత్తు అవసరాలను తీర్చడం, విద్యుత్తు డిమాండ్‌ను అధిగమించేందుకు మనం ఎవరిపైనా ఆధారపడకూడదన్న ఆలోచనతో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. యాదాద్రి ప్లాంట్ ప్రణాళికలు, నిర్మాణం, నిధుల సేకరణ ఏ విషయంలోనూ కాంగ్రెస్ నేతలకు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇసుమంతైనా భాగస్వామ్యం లేదు. ఇప్పుడదే ప్రాజెక్ట్‌ను మేం చకాచకా పూర్తిచేశాం. మాదే క్రెడిట్ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. 70 శాతానికి పైగా నిర్మాణం పూర్తయిన తర్వాత ఇప్పుడొచ్చి అంతా తామే చేసినట్లు, నిర్మించినట్టు పోజులుకొడుతున్నారు. అక్రమాలు జరిగాయన్న ప్రాజెక్టే ఇప్పుడు గొప్ప ప్రాజెక్ట్, దేవాలయం వంటి ప్రాజెక్ట్ అంటూ కొత్త పల్లవినందుకున్నారు.
అబద్ధం : గత ప్రభుత్వ పెద్దలు సబ్ క్రిటికల్ టెక్నాలజీతో చేపట్టిన భద్రాద్రి పవర్‌ప్లాంట్ రాష్ర్టానికి గుదిబండగా మారింది.
నిజం : రాష్ట్రంలో కరెంట్ కష్టాల్లో ఉన్నప్పుడు, బయటి రాష్ర్టాల్లో కరెంట్ దొరకప్పుడు అప్పటికప్పుడు రాష్ట్ర అవసరాలను తక్షణమే తీర్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం బీటీపీఎస్‌ను నిర్మించింది. రాష్ట్రంలోని థర్మల్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) 62.65 కాగా, భద్రాద్రి పవర్ ప్లాంట్‌లో నాలుగు యూనిట్ల పీఎల్ఎఫ్ 66.84గా ఉంది. అంటే రాష్ట్ర సగటు పీఎల్‌ఎఫ్‌ను మించింది. మొత్తం నాలుగు యూనిట్లు విజయవంతంగా నడుస్తున్నాయి. మరీ గుదిబండ ఎలా అవుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. పిడుగు పడటమో లేదా అగ్నిప్రమాదంతోనో ఒక యూనిట్ కాలిపోగా, మరో జనరేటర్‌తో నడుపుతున్నారు. ఈ యూనిట్ ప్రతి రోజు విద్యుత్తునందిస్తూనే ఉంది.