ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులను హెచ్-సిటీగా కాంగ్రెస్ పేరు మార్చింది. ఫ్ల్లైఓవర్లు, అండర్ పాస్లూ, స్కై వేల నిర్మాణం చేయడానికి ప్రతిపాదనలు రూపొందించింది. కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా అమల్లోకి రాలేదు.
కేబీఆర్ పార్క్ చుట్టూ 1070 కోట్లతో ఫ్లైఓవర్, అండర్ పాస్‌ల నిర్మాణం చేయడానికి గతేడాది డిసెంబర్లో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అధికారులు టెండర్లు ఖరారు చేశారే తప్పా… పనులు ప్రారంభించలేదు. భూసేకరణపై స్పష్టత లేకుండా ఆగమేఘాల మీద టెండర్లు పిలువడంతో విమర్శలకు దారితీసింది. రాజకీయ, సినీ , వీఐపీ జోన్ కావడంతో ఈ ప్రాంతంలో భూసేకరణ అడ్డంకులు ఇప్పటికీ అడ్డుపడుతూనే ఉన్నాయి.
ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును నిర్మిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. రూ. 10వేల కోట్లతో జేబీఎస్ నుంచి శామీర్‌పేట, ప్యారడైజ్ నుంచి సుచిత్ర మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తామని హామీ ఇచ్చిన ఇప్పటికీ కనీసం భూసేకరణ కూడా పూర్తి చేయలేదు. ఇక డిఫెన్స్ శాఖ నుంచి భూములు సేకరించామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ… పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన భూ యజమానులకు పరిహారం తేల్చకుండా నోటీసులతో ఏడాది కాలంగా కాలయాపన చేస్తోంది.
నగరంలో మెట్రో విస్తరణ కోసం రూ. 45వేల కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసి కాంగ్రెస్ సర్కారు హడావుడి చేసింది. ఇవాళే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, మరుసటి రోజే ప్రాజెక్టు పనులు మొదలుపెట్టినంత ఆగమేఘాల మీద ప్రకటనలు చేసింది. దాదాపు 9 నెలలుగా మెట్రో రెండో దశ విస్తరణలోని ఏ ఒక్క కారిడార్‌కు కేంద్రం నుంచి అనుమతులు తీసుకురాలేకపోయింది. కనీసం ఓల్డ్ సిటీ మెట్రోకు నిధుల సహకారాన్ని కాంగ్రెస్ సర్కారు పొందలేదు. ఇక వీటితోపాటు పెండింగ్‌లో ఉన్న 8 కారిడార్లలో ఏ ఒక్క మార్గానికి కూడా కేంద్రం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, అనుమతులు వ్యవహారాన్ని గాలికొదిలేసింది.
హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు రూ. 1500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి టెండర్లు ఖరారైతే చేశారు కానీ.. ఇప్పటికీ భూసేకరణపై రైతులు వేసిన కోర్టు పిటిషన్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి ఫోర్త్ సిటీ వరకు నిర్మించే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తామని ప్రణాళికలు రూపొందించగా, ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు మారింది.
వంద కోట్ల అంచనా వ్యయంతో హుస్సేన్ సాగర్ పరిసరాలను అద్భుతమైన వరల్డ్ క్లాస్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని, ఇంటర్నేషనల్ ఏజెన్సీని నియమించింది. కానీ ఇప్పటికీ ఆ ఏజెన్సీ ఏం చేస్తుందనేది అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలింది. ఈ ఏజెన్సీ కోసం దాదాపు రూ. 5 కోట్లు ఖర్చు చేసినట్లుగా తెలిసింది. రూ. లక్షన్నర కోట్లతో హైదరాబాద్ జీవ నది మూసీని ప్రక్షాళన చేస్తామంటూ ఏడాదిన్నర కాలంగా ఊదరగొడుతూనే ఉంది. ఇప్పటికీ టెండర్లు ఖరారు చేసింది లేదు. ప్రాజెక్టులో చెత్తను తొలగించింది లేదు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో ఏది చేసినా వివాదమే. విధానపరమైన లోపాలే ఇప్పుడు నగరాభివృద్ధికి శాపంగా మారుతున్నాయి. ఒకప్పుడు అభివృద్ధి పరుగులు పెట్టిన మహానగరమే అన్ని వివాదాస్పదమైన ప్రభుత్వ విధివిధానాలతో నెట్టుకొస్తోంది. ప్రతిపాదనల రూపకల్పనే లోపాభూయిష్టంగా ఉందని తేలిపోతుండగా… నగరాభివృద్ధికి కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. దీంతో ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఏ ఒక్క ప్రతిపాదన కూడా కార్యరూపంలోకి రాలేదు కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను సీఎం రేవంత్‌రెడ్డి దిగ్విజయంగా ప్రారంభించడం కొసమెరుపు.
చారిత్రక నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పదేండ్లలో ప్రణాళికలు పట్టాలెక్కాయి. నగరంలో అభివృద్ధి పనులు ఏ ఆటంకం లేకుండా ముందు కదిలేలా చేశాయి. ఆ ఫలాలను నగరవాసులు ఆస్వాదిస్తున్నారు. కానీ కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రావడంతో నగరంలో అభివృద్ధి ప్రణాళికల అమలు తీరు మారింది. నగరాభివృద్ధిలో వెనుకబడి పోతున్నది. ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి నగరం స్తంభించిపోతే… అదే అభివృద్ధికి అవసరమైన పనులను శరవేగంగా పూర్తి చేసే గోల్డెన్ అవర్‌గా మారింది. లాక్ డౌన్ సమయంలోనూ ఊహించని స్థాయిలో మెరుగైన మౌలిక వసతులను కల్పించే ప్రాజెక్టులను చకచకా నిర్మిస్తే… ఇప్పుడు అవే ప్రణాళికలను పట్టాలెక్కించేందుకు అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. దీంతో ప్రతిష్టాత్మకంగా శంకుస్థాపన చేసిన ఎలివేటెడ్ కారిడార్ నుంచి అట్టహాసంగా ప్రకటించిన మూసీ ప్రక్షాళన వరకు అన్ని వివాదాలకే కేంద్ర బిందువులుగానే ఉన్నాయి.
సుదీర్ఘకాలంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ వేధించింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ ప్రాజెక్టుకు అవసరమైన రక్షణ శాఖ భూములను బదలాయించేందుకు ఆమోదం తెలిపింది. దీంతోనే గొప్పలు పోయిన కాంగ్రెస్ సర్కారు… ఎలివేటెడ్ కారిడార్ పూర్తి చేసినట్లుగా ఆర్భాటంగా పనులు చేపట్టింది. కానీ ఏనాడూ భూ నిర్వాసితుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు, ప్యారడైజ్ నుంచి సుచిత్ర మార్గంలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
దాదాపు రూ. 10వేల కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రతిపాదనలకు కనీసం ఏడాదిన్నర గడిచిన భూసేకరణ పూర్తి కాలేదు. ఈ రెండు మార్గాల్లో 1500కు మందికిపైగా భూములు కోల్పోతుండగా, ఏనాడూ భూ పరిహారం, ప్రాజెక్టు వెడల్పు విషయంలో చర్చించకుండా భూసేకరణ నోటిఫికేషన్లతో నెట్టుకొస్తున్నది. ఇప్పటికీ శంకుస్థాపన చేసి ఏడాదిన్నర గడిచినా.. ఇంచు భూమిని కూడా ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించలేదు. కానీ వివాదాలు మాత్రం కోర్టుల్లో వందల్లో ఉన్నాయి. అయినా ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి ఇప్పటికీ చొరవ తీసుకోలేదు.
ఇక మూసీ ప్రక్షాళన పేరిట నగరంలో ప్రవహిస్తున్న జీవనదిని అభివృద్ధి చేసే ప్రణాళికలను వివాదాస్పదంగానే మార్చింది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రావడంతోనే మూసీ పరీవాహక ప్రాంతాన్ని రీక్రియేషనల్, పర్యాటక కేంద్రంగా మార్చే క్రమంలో అనాలోచిత విధానాలతో కూల్చివేతలు మొదలుపెట్టింది. అక్కడితో ఆగిపోకుండా అనుమతులు ఉన్న నిర్మాణాలకు మార్కింగ్ చేసి బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయంటూ కూల్చివేతలకు సిద్ధమైంది.
మూసీ పరీవాహక ప్రాంతంలోని అత్తాపూర్ నుంచి మొదలుకుంటే నాగోల్ వరకు వేలాది ఇండ్లను మార్కింగ్ చేయడంతో… ఈ అంశంలోనూ కాంగ్రెస్ పార్టీ బాధితులు కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది. అవసరమే లేకపోయినా నిర్మాణాలను కాపాడుకునేందుకు స్టే కోసం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో మార్కింగ్ కోసం చేసిన హడావుడి, ఒక్క స్టేతో చల్లబడింది. ఇక ట్రిపులార్ ప్రాజెక్టును కూడా ఇదే తరహాలో ప్రకటన చేసిన కాంగ్రెస్ సర్కారు.. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయంతో అలైన్‌మెంట్‌ను మార్చివేసింది. దీంతో పాత అలైన్‌మెంట్‌తోనే ట్రిపులార్ భూసేకరణ చేయాలంటూ 8 జిల్లాల రైతులు, ట్రిపులార్ బాధితులు రోడ్డెక్కారు. ఇలా గాలికి పోయే కంపను నెత్తికి తగిలించి, అభివృద్ధి ప్రణాళికలను పట్టాలెక్కించకుండానే ఐసీయూలోకి చేర్చుతోంది.
గడిచిన ఏడాదిన్నర కాలంలో హెచ్ఎండీఏ పరిధిలోనే రూ. 24వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఇందులో గడిచిన ఏడాది కాలంగా కొన్నింటికీ టెండర్లు ఖరారు చేయగా.. మరికొన్నింటికీ నిధుల సర్దుబాటు చేయకుండానే ఆగిపోయాయి. ఇక మిగిలిన ప్రాజెక్టులన్నింటినీ భూసేకరణ, కేంద్ర సర్కారు ఆమోదం కోసం ఎదురుచూస్తుండగా మొత్తానికి ప్రాజెక్టులు మొదలు కాక ముందే, కాగితాలకే పరిమితం చేసిన ప్రణాళికలతో నగరం అభివృద్ధిలో కుంటుపడింది. దేశంలోని మిగతా మెట్రో నగరాలకే పుష్కలమైన పారిశ్రామిక, మానవ వనరుల లభ్యత ఉన్నా… మెరుగైన మౌలిక వసతుల కోసం ఇప్పటికీ జనాలు ఎదురుచూసే దుస్థితికి లోపభూయిష్టమైన విధానాలతో కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చింది.