‘ ఈ సినిమాలో మంచి ఎంటైర్టెన్మెంట్ ఉంటుంది. అలాగే ఆలోచింపజేసే అంశాలుంటాయ్. అద్భుతమైన కథ రాసుకొని, దాన్ని జనం మెచ్చేలా తెరకెక్కించారు దర్శకుడు అరుణ్ ప్రభు. మంచి బడ్జెట్, అద్భుతమైన కంటెంట్‌తో వస్తున్న సినిమా ఇది’ అన్నారు నిర్మాత రామాంజనేయులు జవ్వాజి. సర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం ‘భద్రకాళి’. హీరోగా విజయ్ ఆంటోని 25వ సినిమా ఇది. అరుణ్‌ప్రభు దర్శకుడు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోని కలిసి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ నెల 19న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్మాత రామాంజనేయులు విలేకరులతో ముచ్చటించారు. ‘ఇప్పటివరకూ ఎవరూ చేయని పాత్రను ఇందులో విజయ్ ఆంటోని చేశారు.
ఇందులో ఆయన పొలిటికల్ బ్రోకర్‌గా కనిపిస్తారు. చాలా డిఫరెంట్ క్యారెక్టర్. సమాజంలో జరుగుతున్న విషయాల ఆధారంగా చేసుకుని తీసిన సినిమా ఇది. ఫస్ట్ కాపీ చూశా. ఊహించిన దానికంటే బాగా వచ్చింది. సినిమా మొదలైన రెండు నిమిషాల్లోనే ప్రేక్షకులు కథలో లీనమైపోతారు.’ అని రామాంజనేయులు చెప్పారు. కథ డిమాండ్ మేరకు ఖర్చు చేశామని, దర్శకుడికి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చామని, సినిమా బాగా రావడానికి కారణం అదేనని రామాంజనేయులు అభిప్రాయపడ్డారు.
‘ప్రారంభం నుంచి ముగింపు వరకూ ఎక్కడా బోర్ లేకుండా తెరకెక్కించిన చిత్రం ‘భద్రకాళి’. విజయ్ ఆంటోని అద్భుతంగా నటించడమే కాదు, చక్కని మ్యూజిక్‌ని కూడా అందించారు. ముఖ్యంగా నేపథ్య సంగీతం గొప్పగా ఉంటుంది. తెలుగులో సత్యదేవ్ హీరోగా మేం చేసిన ‘ఫుల్ బాటిల్’ సినిమా నవంబర్‌లో విడుదల కానుంది. ఇటీవలే ‘బూకీ’ సినిమాను మొదలుపెట్టాం. ‘బిచ్చగాడు’ దర్శకుడు శశి, విజయ్ ఆంటోని కాంబినేషన్లో ‘వంద దేవుళ్లు’ సినిమా చేయబోతున్నాం.’ అని తెలిపారు రామాంజనేయులు జవ్వాజి.