Heavy Rains |హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఆదివారం రాత్రి వాన దంచికొట్టింది. గంటకు పైగా కుండపోత వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా దంచికొట్టిన వానకు నగరం తడిసి ముద్దైంది. లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది.
మియాపూర్ మదీనాగూడ మార్గంలో జాతీయ రహదారిపై వరద నీరు భారీగా వచ్చి చేరింది. కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో, కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద, ఎమ్మెల్యే కాలనీ వద్ద, హైటెక్ సిటీలోని పలు మార్గాల్లో, అమీర్‌పేట, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్ వద్ద, అంబర్‌పేట చే నంబర్‌తో పాటు పలు ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపించాయి.
అబ్దుల్లాపూర్‌మెట్‌లో అత్యధికంగా 12 సెం.మీ., షేక్‌పేటలో 8.0, వట్పల్లి(సంగారెడ్డి)లో 6.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్ బాగ్‌లో 5.53 సె.మీ, నేరెడ్‌మెట్‌లో 5, బండ్లగూడలో 4.75, మల్లాపూర్‌లో 4.2, నాచారంలో 4.13, ఉప్పల్ చిలుకానగర్‌లో 3.85 సె.మీ. వర్షపాతం నమోదైంది.
ఇక గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని వట్టి నాగులపల్లిలో ఓ ప్రహరీ గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు.