Stock Markets : వరుసగా మూడు రోజులు లాభాలు ఆర్జించిన దేశీయ స్టాక్ మార్కెట్ (Stock market) సూచీలు ఇవాళ భారీగా పతనమయ్యాయి. బ్యాంకింగ్, మెటల్, ఆటో, ఎఫ్ఎంసీజీ స్టాక్స్‌లో అమ్మకాలు జోరందుకోవడంతో సూచీలు కుదేలయ్యాయి. ఇరాన్ (Iran) పై ఏ క్షణంలోనైనా అమెరికా (USA) దాడి చేస్తుందన్న భయాలు.. ఫెడ్ వడ్డీ రేట్ల (Fed rates) పై గందరగోళం కారణంగా సూచీలు పతనమయ్యాయి.
ఇవాళ్టి పతనంతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. మదుపర్ల సంపద దాదాపు రూ.8 లక్షల కోట్లు ఒక్కరోజులోనే ఆవిరైంది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.472 లక్షల కోట్ల నుంచి రూ.464 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఓ దశలో 1,400 పాయింట్లకుపైగా నష్టపోగా.. నిఫ్టీ 25,500 దిగువకు చేరింది.
బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 83,969.82 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 83,734.25) లాభాల్లో ప్రారంభమైంది. కాసేపు లాభాల్లో కదలాడిన సూచీ క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. ఈ క్రమంలో ఇంట్రాడేలో 82,264.20 వద్ద కనిష్ఠస్థాయికి పడిపోయింది. చివరికి 1236.11 పాయింట్ల నష్టంతో 82,498.14 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 365 పాయింట్ల నష్టంతో 25,454 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో ఒక్కటంటే ఒక్కటీ లాభపడలేదు. ఇండిగో, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, బీఈఎల్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. ఇరాన్‌పై ఏ క్షణంలోనైనా అమెరికా దాడికి పాల్పడవచ్చనే భయాలు మన మార్కెట్ సూచీల పతనాన్ని శాసించాయి.