Sunitha Laxma Reddy | వెల్దుర్తి, ఫిబ్రవరి 24 : నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం వెల్దుర్తికి వచ్చిన సబితా ఇంద్రారెడ్డి.. నాయకులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. కల్యాణలక్ష్మీ చెక్కులు వచ్చి నెలలు గడుస్తున్నా నేటికీ లబ్ధిదారులకు ఇవ్వకుండా మంత్రులు వస్తారని చెప్పి అడ్డుకుంటున్నారని అన్నారు. మంత్రులు రాకపోవడంతో చెక్కుల పంపిణీ నిలిచిపోయిందని, దీంతో చెక్కులు రాక లబ్ధిదారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని చెప్పారు. కల్యాణలక్ష్మీ చెక్కులు కూడా ఇవ్వకుండా అడ్డుకునే దుస్థితి కలిగిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినట్లుగా తులం బంగారం ఇస్తే లబ్ధిదారులు సంతోషించేవారని.. కానీ కేసీఆర్ ఇచ్చిన లక్ష ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీకి మంజూరైన రూ.12 కోట్ల నిధులను నిలిపివేయడంతో, పనులు ప్రారంభం కాలేదని అన్నారు. మహ్మద్‌నగర్, చండూర్ గ్రామాల్లో సబ్స్టేషన్ల శంకుస్థాపనలు చేయడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే కోటా కంటే అధిక నిధులు తీసుకొచ్చిన నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అంతేకానీ పనులను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.68 కోట్ల తండాల రోడ్లు, ఎస్డీఎఫ్ నిధులు, నర్సాపూర్ మున్సిపల్ నిధులు రూ.40 కోట్లు అన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. కౌడిపల్లిలో ఉన్న 132/33 కేవీ సబ్స్టేషన్లలో రెండు 60 ఎంబీఏ ట్రాన్స్ఫార్మర్లు ఉండగా, గుట్టుచప్పుడు కాకుండా ఒక 60ఎంబీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను వేరే చోటికి తరలించి, 16 ఎంబీఏ ట్రాన్స్ఫార్మర్ను బిగించారని తెలిపారు. దీనివల్ల లో వోల్టేజీ సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయమై సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. వెంటనే పాత ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి కరెంటు సమస్యను తీర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అభివృద్ధికి అడ్డుపడితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
ఈ సమావేశంలో నాయకులు చంద్ర గౌడ్, రమేశ్ గౌడ్, మోహన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, తోట నర్సింలు, క్రిష్ణా గౌడ్, హరికృష్ణ, అశోక్ గౌడ్, రమణ గౌడ్, శాఖారం శ్రీను, శ్రవణ్, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.