మెదక్, ఫిబ్రవరి 10(నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు బరితెగించి బీఆర్ఎస్ అభ్యర్థులు,నేతల ఇండ్లపై దాడులు చేస్తున్నారు. మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం కావడంతో కాంగ్రెస్ నాయకులకు భయం పట్టుకున్నది. దీంతో మెదక్ పట్టణంలో సోమవారం రాత్రి బీఆర్ఎస్ అభ్యర్థుల ఇండ్లపై దాడికి యత్నించారు. సోమవారం రాత్రి మెదక్ పట్టణంలోని 15,30 వార్డుల్లో కాంగ్రెస్ నాయకులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తుండగా, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు పట్టుకున్నారు. దీంతో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ ఇంటిపై కాంగ్రెస్ నాయకులు దాడికి యత్నించారు. ఇంతటితో అగకుండా తమ ఇంటిపై దాడి చేశారని ఓ ఎస్సీ మహిళతో కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్గౌడ్పై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండానే మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, న్యాయవాది జీవన్రావుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.
మెదక్ పట్టణం, రామాయంపేటలో సోమవారం బీఆర్ఎస్ నిర్వహించిన భారీ ర్యాలీ, కార్నర్ మీటింగ్‌లు సక్సెస్ అయ్యా యి. భారీగా జనం తరలివచ్చారు. మెదక్, రామాయంపేట పట్టణాలు గులాబీమయం అయ్యాయి. దీంతో కాంగ్రెస్ నాయకుల్లో ఓటమి పట్టుకుని దాడులకు దిగారు. అంతేకాకుండా మాజీ మంత్రి తన్నీర్ హరీశ్‌రావు బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులకు దిశానిర్దేశం చేశారు. మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, షారూఖ్ హుసే న్, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి, మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. వాతావరణం బీఆర్ఎస్కు అనుకూలంగా మారడంతో కాంగ్రెస్ నాయకులు ఓటుకు రూ.3 వేల చొప్పున పంపిణీ చేశారు. మద్యం, ఇతర ప్రలోభాలకు గురిచేశారు. దీనిని బీఆర్ఎస్ అడ్డుకోవడంతో కాంగ్రెస్ నాయకులు దాడులకు దిగారు. ఇంత జరిగినా ఎన్నికల అధికారులు, పోలీసులు చోద్యం చూశారే తప్పా చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన ఇంట్లో నుంచి బయటకు రాకుండా మంగళవారం ఉదయం నుంచి పోలీసులు ఆయన ఇంటి వద్ద కాపలా కాశారు. కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు రద్దుచేస్తామని ఓటర్లను కాంగ్రెస్ నాయకులు హెచ్చరిస్తున్నారు.
కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు దిగినా, విచ్చలవిడిగా డబ్బులు,చ మద్యం పంపిణీ చేసినా మెదక్ మున్సిపల్‌పై ఎగిరేది గులాబీ జెండానే అని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మెదక్ కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ నగేశ్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ నాయకులు నాన్ లోకల్ నాయకులు, రౌడీలను తెచ్చి బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు అత్యుత్సాహంతో బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించరు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, బెదిరింపులకు బయపడే ప్రసక్తే లేదన్నారు. అధికారం శాశ్వతం కాదని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని, వడ్డీతో సహా చెల్లిస్తామని పద్మాదేవేందర్‌రెడ్డి హెచ్చరించారు.
మెదక్, రామాయంపేటలో ఓటమి తప్పదనే భయంతోనే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఆరోపించారు. మెదక్‌లో కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నా ఎన్నికల అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. పోలీసులు విచారణ చేయకుండానే బీఆర్ఎస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారన్నారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల పై దాడులు చేసినా వారిపై పోలీసులు కేసులు నమోదు చేయలేదన్నారు.