బాన్సువాడ/రుద్రూర్(వర్ని), ఫిబ్రవరి 10: కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు పెరిగి పోతున్నది. ప్రధానంగా బాన్సువాడ నియోజకవర్గంలో అంతర్గత వైరం ముదురుతున్నది. చివరకు దాడులు, పోలీసు కేసుల వరకూ వెళ్లడం పార్టీ శ్రేణుల్లో కంగారు పుట్టిస్తున్నది. తాజాగా రుద్రూర్ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నేత చంద్రశేఖర్‌పై రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ వ్యవహరించిన తీరు కలకలం రేపింది.
మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ సోమవారం రాత్రి బాన్సువాడకు వెళ్లారు. ఇది గమనించిన కాసుల బాల్‌రాజ్ ఆయనపై దౌర్జన్యానికి దిగారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచా రం చేయడానికే వచ్చావంటూ చంద్రశేఖర్‌ను నడిరోడ్డుపై గల్లా పట్టుకుని దూషిస్తుండగా, కొందరు వీడి యో తీశా రు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆగ్రోస్ చైర్మన్ బాల్‌రాజ్ దాడి చేయడాన్ని నిరసిస్తూ రుద్రూర్ గ్రామస్తులు మంగళవారం ధర్నాకు దిగారు. పలు గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. కాసుల బాల్‌రాజ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ వర్ని-బోధన్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. అనంతరం కాసుల దిష్టిబొమ్మను దహనం చేశారు. బాన్సువాడ సమీపంలోని తాడ్కోల్కు చెందిన తన స్నేహితుడు భోజనానికి పిలిస్తే వెళ్లానని, తిరిగి వస్తున్న క్రమంలో బాల్‌రాజ్ ఆపి తనపై దాడి చేశాడని చంద్రశేఖర్ ఈ సందర్భంగా తెలిపారు. పోలీసులు వచ్చే సమయంలో వారి వద్ద ఉన్న నోట్ల కట్టను తన చేతిలో పెట్టారని, ఇలాంటి నీచ రాజకీయాలు ఎన్నడూ చూడలేదన్నారు.
కాంగ్రెస్‌లో వలస నేతలదే పెత్తనం కొనసాగుతున్నదని, ఇలాంటి వారితో కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందన్నారు. మరోవైపు, చంద్రశేఖర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియామవళిని ఉల్లంఘిస్తూ, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు బాన్సువాడలో పర్యటించారని ఫ్లయింగ్ స్కాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తుల శ్రీధర్ తెలిపారు. మరోవైపు, కాసుల బాల్‌రాజ్ తనపై దాడి చేసినట్లు చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారని చెప్పారు.