నర్సంపేట, సెప్టెంబర్18: దివ్యాంగుడి ఇంటిపై కాంగ్రెస్ నేత, అతడి అనుచరులు విచక్షణారహితంగా దాడికి దిగారు. ఈ దారుణాన్ని ఆపేందుకు వెళ్లినవారినీ వదిలిపెట్టలేదు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం జాతీయ రహదారిపై నిరసన తెలిపింది. ఈ దయనీయ ఘటనకు వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగింది. నర్సంపేటకు చెందిన కొంగ మురళి (దివ్యాంగుడు) -నాగలక్ష్మి దంపతులు గృహ నిర్మాణ సామగ్రి కిరాయికి ఇచ్చుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
గురువారం నర్సంపేటకు చెందిన కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ తిరుపతి, అతడి అనుచరులు మల్లంపల్లి రోడ్డులోని మురళి ఇంటికి వెళ్లి మురళి చిన్న కుమారుడు వినోద్‌కుమార్‌ను చితకబాదారు. అడ్డుకోబోయిన వారిపైనా దాడిచేశారు. కాంగ్రెస్ నాయకులు అకారణంగా దాడి చేశారంటూ మల్లంపల్లి వద్ద బాధిత కుటుంబం ధర్నా చేసింది.