మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 18 : ‘మా పార్టీ అధికారంలో ఉన్నది.. మన ఏరియాలో కాంగ్రెస్‌కు మద్దతుగా ఉండాలి.. లేకపోతే మంచిది కాదు’ అని ఓ కాలనీకి చెందిన వ్యక్తిని ఎమ్మెల్యే పీఏ బెదిరించాడు. వినకపోవడంతో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకున్నది. బాధితుడి కథనం మేరకు.. మహబూబ్‌నగర్‌లోని పాత పాలమూరులో యేనికె శివరాజ్ కారు నడుపుకొంటూ జీవిస్తున్నాడు. గతంలో బీఆర్ఎస్ కార్యకర్తగా కొనసాగగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు.
శివరాజ్‌కు అదే ప్రాంతానికి చెందిన ఎల్లంగారి భరత్‌తో పరిచయం ఉన్నది. ప్రస్తుతం భరత్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి వద్ద పీఏగా పనిచేస్తున్నాడు. భరత్.. శివరాజ్‌తో అంటీముట్టనట్టుగా ఉంటున్నాడు. అయితే బుధవారం రాత్రి యూత్ కాంగ్రెస్ నాయకుడు అక్రమ్.. శివరాజ్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే పీఏ భరత్ పిలుస్తున్నాడు.. రావాలని చెప్పాడు. దీంతో శివరాజ్ అతడితో కలిసి వెళ్లాడు. తన అన్న భరత్ వెంట తిరగాలని.. కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలని అతడి తమ్ముడు గౌతమ్ కోరాడు.
తాను ఎవరితోనూ తిరగనని.. తన పని తాను చేసుకుంటానని శివరాజ్ చెప్పాడు. అక్కడే ఉన్న భరత్.. ‘ఏం రా తమాషా చేస్తున్నావా?’ అంటూ తీవ్ర పదజాలంతో దూషిస్తూ శివరాజ్‌పై దాడి చేశాడు. భరత్‌తోపాటు అతని సోదరుడు గౌతమ్, అక్రమ్, ముక్రమ్ హాకీ బ్యాట్‌తో విరుచుకుపడగా.. ముక్రమ్ కొడవలితో చేతులపై దాడి చేశాడు. శివరాజ్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
శివరాజ్ చికిత్స తర్వాత తిరిగి ఇంటికి వస్తుండగా.. సీఐ అడ్డగించాడు. అతడిని మళ్లీ దవాఖానకు తీసుకెళ్లాడు. రిపోర్ట్ మార్చాలని.. డాక్టర్‌ను బెదిరించాడు. రిపోర్ట్ మారిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని శివరాజ్ స్పష్టంచేశాడు. దీంతో సీఐ బెదిరిస్తూ ‘అరే శివరాజ్.. నా మాట వినకుంటే సినిమా చూపిస్తా.. ఏం అనుకుంటున్నారో’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడని బాధిత యువకుడు తెలిపాడు.