దుబాయ్ : ఆసియాకప్‌లో భారత్ ఆఖరి లీగ్ మ్యాచ్‌కు సిద్ధమైంది. శుక్రవారం ఒమన్‌తో టీమ్ఇండియా తలపడనుంది. ఇప్పటికే యూఏఈ, పాకిస్థాన్ జట్లను చిత్తు చేసిన సూర్యకుమార్‌యాదవ్ నేతృత్వంలోని భారత్.. ఒమన్‌తో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నది. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగ్గట్లు వరుస విజయాలతో దూసుకెళుతున్న టీమ్ఇండియాకు ఒమన్ ఏ మేరకు పోటీనివ్వగలదు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సూపర్-4కు అర్హత సాధించిన సూర్యసేన..ఒమన్‌తో మ్యాచ్‌ను బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం వాడుకునేందుకు చూస్తున్నది. యూఏఈ, పాక్‌తో మ్యాచ్‌ల్లో స్వల్ప లక్ష్యాలను అలవోకగా ఛేదించిన టీమ్ఇండియా..ఒమన్‌పై పూర్తిస్థాయి బ్యాటింగ్ కోసం సిద్ధమవుతున్నది.
ఆదివారం పాక్‌తో జరిగే సూపర్-4 పోరుకు సన్నాహకంగా ఒమన్ మ్యాచ్ తీసుకోవాలని భావిస్తున్న టీమ్ఇండియా అందుకు తగ్గట్లు ప్రాక్టీస్‌లో చెమటోడుస్తున్నది. టోర్నీలో ఓపెనర్ అభిషేక్‌శర్మ మంచి ఫామ్‌లో ఉండగా, గిల్ బ్యాటు ఝులిపించలేకపోతున్నాడు. పాక్‌తో పోరులో సూర్యకుమార్, తిలక్‌వర్మ బ్యాటింగ్ చేసే అవకాశం రాగా, మిడిలార్డర్లో శాంసన్, హార్దిక్, శివమ్, అక్షర్‌పటేల్ సరైన బ్యాటింగ్ ప్రాక్టీస్ లేకుండా పోయింది. ఇక స్టార్ బౌలర్ బుమ్రా విశ్రాంతినిచ్చే అవకాశం కనిపిస్తుండగా, అతని స్థానంలో అర్ష్‌దీప్‌సింగ్ రాక ఖాయం కానుంది. హర్షిత్ రానాకు బెర్తు దక్కే చాన్స్ ఉంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఒమన్..టీమ్ఇండియాకు కనీస పోటీనివ్వాలని చూస్తున్నది.