హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 కోట్ల చెక్ ఇవ్వడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాశమైంది. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో రూ. 2 కోట్ల మేర ఆస్తులు చూపించని ఆయన అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే అంత డబ్బు ఎలా ఇచ్చారు? ఎందుకిచ్చారన్న చర్చ మొదలైంది. బీఎల్ఆర్ గన్‌మన్ నాగునాయక్ ఇటీవల లారీ యూరియా లోడును ఏపీకి దారి మళ్లించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఒక్క యూరియా బస్తా కోసం రైతులు రాత్రనక, పగలనక క్యూలలో నిల్చుంటున్న వేళ అధికార పార్టీ ఎమ్మెల్యే అంగరక్షకుడు ఏకంగా లారీ యూరియా లోడును ఏపీకి తరలించడం వివాదాస్పదమైంది. తనపై వచ్చిన అపవాదును, యూరియాను అక్రమంగా అమ్ముకున్నారనే ఆరోపణల నుంచి బయటపడేందుకు సీఎంఆర్ఎఫ్కు ఎమ్మెల్యే రూ.2 కోట్లు చెక్ ఇచ్చారని విపక్ష నేతలు చెప్తున్నారు. ఆ సొమ్ముతో తన నియోజకవర్గంలోని లక్ష మంది రైతులకు ఒకో యూరియా బస్తా ఉచితంగా అందజేయాలని ఎమ్మెల్యే కోరడం వెనుక చేసిన పాపాన్ని కడిగేసుకోవాలని చూస్తున్నట్టు నెటిజన్లు విమర్శిస్తున్నారు.
ఇటీవల వ్యవసాయశాఖ అధికారులకు ఫోన్ చేసిన నాగునాయక్ యూరియా లారీని మూడో కంటికి తెలియకుండా ఏపీకి తరలించారని మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఎమ్మెల్యే సూచనతోనే గన్‌మన్ ఈ వ్యవహారం నడిపించినట్టు ఆరోపణలు వచ్చాయి. తమకు అందాల్సిన యూరియాను అధికార పార్టీ ఎమ్మెల్యే దారి మళ్లించడంపై నియోజకవర్గ రైతులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ పోస్టులు పెట్టారు. మారెట్లో అందుబాటులో లేదని, రెండు బస్తాల కోసం రోజుల తరబడి రోజులు వేచి చూడాల్సిన పరిస్థితులతో నానా అవస్థలు పడుతుంటే అధికార పార్టీ అండదండలతో కొందరు లారీ లారీలకే మళ్లించుకుంటున్నారని అన్నదాతలు ఫైరయ్యారు.
లారీ యూరియాను దారి మళ్లించిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసు ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. బీఎల్ఆర్ గన్‌మన్ నాగునాయక్ వ్యవహారాన్ని నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్రపవార్ సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే విచారణకు ఆదేశాలు జారీచేశారని తెలిసింది. విచారణ నివేదిక వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం 54వసారి ఢిల్లీ పయనమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా పలు ప్రైవేటు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు. సొంత పార్టీ పెద్దలు కేసీ వేణుగోపాల్ లేదంటే పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేతో సమావేశమై స్థానిక ఎన్నికలతోపాటు జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక అంశంపైనా చర్చించే అవకాశం ఉందని తెలిసింది.