టోక్యో : గత రెండు ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పతకాలు గెలిచి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలో నిలిచిన భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రాకు ఊహించని షాక్. టోక్యోలో జరుగుతున్న ప్రతిష్టాత్మక టోర్నీలో భాగంగా ఆరో రోజు జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్.. 8వ స్థానంలో నిలిచాడు. భారత్‌కు కచ్చితంగా పతకం వచ్చే ఈ విభాగంలో నీరజ్.. టాప్-3లో కూడా నిలువకపోగా అతడి అత్యుత్తమ త్రో 84.03 మీటర్లుగా నమోదవడం భారత అభిమానులను విస్మయానికి గురిచేసింది. గత ఏడేండ్లలో ఒక మేజర్ టోర్నీలో పతకం లేకుండా ఖాళీ చేతుల్తో రావడం నీరజ్‌కు ఇదే మొదటిసారి. అయితే మరో భారత అథ్లెట్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్ యాదవ్ మాత్రం నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకం కోల్పోయాడు.
తొలి ప్రయత్నంలోనే అతడు జావెలిన్‌ను 86.27 మీటర్ల దూరం విసిరాడు. 40 సెంటిమీటర్ల తేడాతో సచిన్ కాంస్య పతకాన్ని కోల్పోవాల్సి వచ్చింది. అమెరికా అథ్లెట్ కర్టిస్ థాంప్సన్ (86.67 మీటర్లు) కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. 2012 ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన ట్రినిడాడ్ అండ్ టొబాగో అథ్లెట్ కెషొర్న్ వాల్కట్ (88.16 మీటర్లు) స్వర్ణం గెలుచుకోగా గ్రెనెడా వీరుడు అండర్సన్ పీటర్స్ (87.38 మీ.) రజతం నెగ్గాడు. కాగా ఫైనల్లో ఒక్క అథ్లెట్ కూడా 90 మీటర్ల మార్కును అందుకోలేకపోయాడు. పారిస్ ఒలింపిక్స్‌లో రికార్డు త్రో (92.97 మీ.)తో పాటు రెండుసార్లు 90 మీటర్ల మార్కును అందుకున్న పాకిస్థానీ అర్షద్ నదీమ్ అయితే పదో స్థానానికి పరిమితమయ్యాడు. ఫైనల్లో అతడి అత్యుత్తమ త్రో 82.75 మీ.గా నమోదైంది. ఫేవరెట్లుగా భావించిన నీరజ్, నదీమ్‌తో పాటు జర్మనీకి చెందిన జులియన్ వెబర్ (86.11 మీతో ఐదో స్థానం), జాకుబ్ వాద్లెచ్ (చెక్.. 78.71 మీ. తో 11వ స్థానం) దారుణంగా విఫలమయ్యారు.
ప్రపంచ చాంపియన్లు పాల్గొనే అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో దిగ్గజ అథ్లెట్లు విఫలమైన చోట భారత యువ సంచలనం సచిన్ యాదవ్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ నాలుగో స్థానంలో నిలిచాడు. 25 ఏండ్ల ఈ యూపీ కుర్రాడు 40 సెంటిమీటర్ల దూరంతో పతకాన్ని కోల్పోయినా భారత్ నుంచి నీరజ్ వారసత్వాన్ని కొనసాగించేందుకు తానున్నానని ప్రపంచానికి చాటిచెప్పాడు. 1999లో యూపీలోని భాగ్‌పట్ జిల్లా ఖేక్రా గ్రామంలో జన్మించిన సచిన్ చిన్ననాటి నుంచి క్రికెట్‌కు వీరాభిమాని. భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీతో పాటు పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఆరాధించే అతడు.. 2019లో క్రికెట్ నుంచి జావెలిన్ త్రోకు మారాడు. ఆరడుగుల (6.5) పొడవు ఉన్న సచిన్.. క్రికెట్ కంటే జావెలిన్ త్రోలో బాగా రాణిస్తాడని, అతడి బౌలింగ్ యాక్షన్ జావెలిన్ త్రోకు సరిగ్గా నప్పుతుందని తన సమీప బంధువు సందీప్ యాదవ్ ఆ దిశగా ప్రోత్సహించాడు. 2023లో మొదటిసారి 80 మీటర్ల మార్కును దాటిన సచిన్.. 2025 ఆసియా చాంపియన్‌షిప్స్‌లో రజతం గెలిచాడు. ఈ ఏడాది డెహ్రాడూన్‌లో జరిగిన జాతీయ క్రీడల్లోనూ 84.39 మీటర్లతో సత్తాచాటాడు. తాజాగా టోక్యోలో తొలి ప్రయత్నంలోనే 86 మీటర్లు విసిరిన అతడు.. తర్వాత 85.71, 84.90, 85.96 మీటర్లు విసరడం విశేషం.