హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ నేతలు కాడిపారేశారా? ఈ ప్రభుత్వం మళ్లీ రాదని ప్రజలు ఫిక్సయినట్టుగానే, వారు కూడా మళ్లీ వచ్చేది లేదని నమ్ముతున్నారా? మంత్రులు మొదలుకొని చివరికి ముఖ్యమంత్రికి కూడా ఇదే అనుమానం వచ్చిందా? ఇటీవల వారి వ్యవహార శైలి, చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఇలాగే అనిపిస్తున్నది. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ‘మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే. రాబోయే పదేండ్లు నేనే సీఎంగా ఉంటా. 2023 నుంచి 2033 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండే బాధ్యతను నేనే తీసుకుంటా’ రేవంత్‌రెడ్డి తరుచూ చేసే వ్యాఖ్యలు ఇవి. కానీ 20 నెలల పాలన తర్వాత ఆయన స్వరం మారింది. తీవ్ర ప్రజా వ్యతిరేకత చూసిన తర్వాత అసలు విషయం బోధపడినట్లుంది.
ఇప్పుడు ఆయనలో ఆ ధీమా కనిపించడం లేదు. స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పనపై బుధవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో సీఎం తన మనసులో మాటను బయటపెట్టారట. ‘మేముండేది మూడేండ్లే. కాబట్టి అంతవరకే రోడ్‌మ్యాప్‌ను రూపొందించండి’ అని అధికారులతో అన్నట్టు సమాచారం. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ఒక కార్యక్రమాన్ని లేదా పథకాన్ని తయారుచేసే సమయంలో రాబోయే ఐదేండ్లు, పదేండ్లను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రూపొందిస్తుంది.
కాబట్టి కనీసం నాలుగైదేండ్లకు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేద్దామని సమావేశంలో పాల్గొన్న కొందరు అభిప్రాయపడినట్టు తెలిసింది. దీంతో కల్పించుకున్న సీఎం ‘ఇప్పుడైతే మూడేండ్లే మా చేతిలో ఉంది. అంతవరకు మాత్రమే రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయండి. మేమున్నంత వరకు అవసరమైన నిధులను కేటాయిస్తాం’ అని సీఎం స్పష్టం చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీనిని బట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావడం కష్టమమేని సీఎం పరోక్షంగా ఒప్పకున్నారా? అని అక్కడున్న అధికారులు చర్చించుకున్నారట. పదేండ్లు నేనే సీఎంగా ఉంటాన్న వ్యక్తి, 20 నెలలకే మాట మార్చడానికి ప్రజావ్యతిరేకతే కారణమని కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆరు గ్యారెంటీలు, పంచ రంగుల మ్యానిఫెస్టోతో రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ బుట్టలో వేసుకున్నదన్న అభిప్రాయం ఉన్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చలేక సతమతం అవుతున్నది. ఆ రంగం, ఈ రంగం అనే తేడాలేకుండా అన్నింటా విఫల ముద్ర వేసుకుంటున్నది. అరకొర రుణమాఫీతో రైతులు ఆగ్రహంగా ఉన్నారు. రైతుభరోసా ఇచ్చామని చెప్తున్నా, ఎగ్గొట్టిందే ఎక్కువ. వడ్లను కొనకపోవడంతో రైతులు మిల్లర్లకు అమ్ముకోవాల్సి వచ్చింది. హైడ్రాతో రియల్ ఎస్టేట్ కుదేలైంది. ఏ పని జరగాలన్నా అన్ని స్థాయిల్లో కమీషన్లు ఇవ్వాలన్న పరిస్థితి దాపురించింది.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినా, బస్సులు తగ్గించడంతో మహిళలు బస్సుల్లో తన్నుకోవాల్సిన పరిస్థితి. రూ. 500కే గ్యాస్ పథకం అటకెక్కింది. గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు తీర్పు సర్కారుకు చెంపపెట్టుగా తయారైంది. ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలేవని నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. డిమాండ్ల సాధనకు ఉద్యోగులు పోరుబాట పట్టారు.
ఆరోగ్యశ్రీ బకాయిల కోసం దవాఖాన్లను బంద్ పెట్టాల్సి వచ్చింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం విద్యాసంస్థలు బంద్‌కు పిలుపునియ్యాల్సి వచ్చింది. ఫుడ్ పాయిజన్లు, రైతుల ఆత్మహత్యలతో రాష్ట్రం అట్టుడుకుతున్నది. తాజాగా యూరియా కొరత ఇటు రైతులకు, అటు ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. 20 నెలలకే పరిస్థితి ఇలా ఉంటే మరో మూడేండ్లు ఎట్లా భరించేదంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.
ప్రభుత్వానికి అందుతున్న ఇంటెలిజెన్స్ నివేదికల్లోనూ తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నదట. గుట్టుగా నిర్వహిస్తున్న సర్వేల్లోనూ సానుకూల ఫలితాలు కనిపించడంలేదని సచివాలయ వర్గాలు తెలిపాయి. ఈ వ్యతిరేకతతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్న ధైర్యం కూడా చేయడం లేదన్న ప్రచారం జరుగుతున్నది. ప్రజా వ్యతిరేకతను గ్రహించే ఈ మధ్య మంత్రులు సైతం మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కష్టమే అని బహిరంగంగానే చెప్తున్నారు.
గత వారం మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ జిల్లాలో ఓ సభలో మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో, రాదో అని వ్యాఖ్యానించారు. అందుకే తాను ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోవడం లేదంటూ తేల్చేశారు. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తాజాగా మాట్లాడుతూ రీజినల్ రింగ్ రోడ్ పూర్తయ్యేనాటికి ఎవరు ఉంటారో, ఎవరు పోతారో తెలియదని, ప్రభుత్వాలు మారుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏకంగా ఒక అడుగు ముందుకు వేసి రాష్ట్రంలోని యువత తిరగబడి నేపాల్ తరహాలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేస్తారని హెచ్చరించారు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వాలేవీ మనుగడ సాగించలేవని పేర్కొన్నారు. మిగతా మెజార్టీ మంత్రుల్లోనూ మరోసారి అధికారంలోకి రాలేమనే భావన బలంగా నాటుకుపోయిందని సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ ప్రభుత్వానికి మరోసారి ఓటేసేదే లేదని మహిళలు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు తెగేసి చెప్తున్నారు. తాజాగా నిద్రాహారాలు మాని యూరియా లైన్లలో పడిగాపులుగాస్తున్న రైతులు ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఎట్టిపరిస్థితుల్లోనూ మరోసారి ఓటేసేది లేదని చెప్తున్నారు. ‘మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదని మా వాళ్లకు అర్థమైంది. అందుకే కీలక నేతలంతా విధులు పక్కనబెట్టి, సంపాదన వెనుకపడ్డారు’ అంటూ కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది. ఈ పరిణామాలన్నింటితో రేవంత్‌రెడ్డి రాగం కూడా మారినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పదేండ్లు నేనే సీఎం అన్న నోటితోనే కాంగ్రెస్‌ది మరో మూడేండ్ల ముచ్చటే అని చెప్పుకోవాల్సిన పరిస్థితికి దిగజారినట్టు చెప్తున్నారు.