కొల్లాపూర్ : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ వివిధ రకాలుగా దాడులకు పాల్పడుతున్నది. మరికొన్ని చోట్ల ప్రభుత్వ పథకాలను అడ్డుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. కాగా, నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రానికి చెందిన వితంతు మహిళను ఇల్లు కూలిపోయిన ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయకుండా అధికార పార్టీ నాయకులు వేధిస్తున్నారని సదరు మహిళ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది.
గురువారం మండల కేంద్రంలో బాధిత మహిళ ఇంటిని మాజీ ఎమ్మెల్యే పరిశీలించారు. భర్త తోపాటు చెట్టు అంతా కొడుకును కోల్పోయి ఒంటరి జీవితం గడుపుతున్న పబ్బతి అలివేలు అనే మహిళ పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు కనీస కనికరం లేకుండా ఆమె అల్లుడు బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నాడని ఇందిరమ్మ ఇల్లును కట్ చేయడం దుర్మార్గమన్నారు.
ఏదైనా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నప్పుడు అర్హులైన నిజమైన లబ్ధిదారులను గుర్తించాలి కానీ రాజకీయాలను ముడిపెట్టి నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేయొద్దని ఆయన అన్నారు. నిజమైన లబ్ధిదారులను వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు సంక్షేమ పథకాలను పంచుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే తప్పుడు పద్ధతులను మానుకొని రాజకీయ బేధాభిప్రాయాలు లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.