ఇదిగో క్యాలెండర్.. అదిగో గ్యారెంటీ అంటూ కాంగ్రెస్ సర్కారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్.. జాబ్‌లెస్ క్యాలెండర్ అయ్యింది. జూలై 30తో జాబ్ క్యాలెండర్ గడువు ముగియగా, ప్రకటించిన నాటి నుంచి రోజుకో కారణం చెప్పి తప్పించుకున్నది. ఒక్క కొత్త నోటిఫికేషనూ ఇవ్వకపోగా, కమిటీల పేరిట కాలయాపన చేసింది. నాడు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి పంచన చేరిన కాంగ్రెస్ పార్టీ, గద్దెనెక్కాక నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లి వంచన చేసిందనే అపవాదు మూటగట్టుకున్నది. మరోవైపు తమ ఉద్యోగాలేవని కాంగ్రెస్ నేతలను నిరుద్యోగులు ఎక్కడికక్కడ నిలదీస్తుండగా, స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి ఆ పార్టీకి గట్టి బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసినా, అందులో ప్రకటించినట్టు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఒక్క కొత్త ఉద్యోగమూ భర్తీ చేయలేదు. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా 2025 జూలై 30లోగా అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ గడువు బుధవారంతో ముగిసింది. ఇది వాస్తవ పరిస్థితి. ఇక కొత్త నోటిఫికేషన్లు ఇప్పట్లో వచ్చే అవకాశాల్లేవు. ఆగస్టులో స్థానిక సంస్థల ఎన్నికలు… ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు. ఇలా ఎన్నికల కోడ్‌తో కాలం గడిచిపోనుంది. మరోవైపు కాంగ్రెస్ నేతలు కనిపిస్తే చాలు నిరుద్యోగులు నిలదీస్తున్నారు. ‘ఇస్తే ఉద్యోగాలివ్వండి.. లేదంటే మా పెళ్లిళ్లు మీరే చేయండి. మమ్మల్ని మీరే పోషించండీ అంటూ నిరుద్యోగి అస్మా కాంగ్రెస్ నేతలను కడిగిపారేశారు. నోటిఫికేషన్లు ఇవ్వకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేస్తామని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు.
‘ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసే నెల, ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారనే వివరాలను జాబ్ క్యాలెండర్ లో పొందుపరిచాం. నియామకాలు నిర్వహించే ఏజెన్సీ, ఉద్యోగానికి కావాల్సిన అర్హతలను ప్రకటిస్తున్నాం’ అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పటివరకు ఆ క్యాలెండర్‌కు అతీగతీ లేదు. డిప్యూటీ సీఎం ప్రకటించిన షెడ్యూలు గానీ నోటిఫికేషన్లు కానీ ఒకటైనా విడుదల కాలేదు. ఒక్క నోటికేషన్ ఇవ్వని జాబ్ క్యాలెండర్‌గా కాంగ్రెస్ క్యాలెండర్ రికార్డులకెక్కింది. ఇక అసెంబ్లీలో పెట్టి.. చట్టబద్దత కల్పిస్తామన్నారు. చట్టబద్ధత సట్టుబండలయ్యింది. జాబ్ క్యాలెండర్లో అక్టోబర్ నెలలో గ్రూప్ -1 కొత్త నోటిఫికేషన్‌ను ఇస్తామన్నారు. చట్టబద్దత కల్పించకుండా, అసెంబ్లీలో ఉత్తుత్తి ప్రకటన చేసి ఉస్సూరుమనిపించారు. పాత ఆర్థిక సంవత్సరం గడిచిపోయింది. కొత్త ఆర్థిక సంవత్సరంలో మనమున్నాం. కనీసం ఈ సంవత్సరంలోనైనా కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. ఇస్తే సంవత్సరం మొదట్లో జనవరిలో ఇవ్వాలి. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో అనుకుంటే ఏప్రిల్ 1న ఇవ్వాలి. జనవరి ఒకటి పోయింది.. ఏప్రిల్ ఒకటి కూడా గడిచిపోయింది. కానీ కొత్త జాబ్ క్యాలెండర్ పత్తాలేకుండా పోయింది. ఇది చాలదంటూ ఆఖరికి ఉద్యోగాలు భర్తీచేసే టీజీపీఎస్సీ ఇండెంట్లు ఇవ్వండి మహాప్రభో అంటే దానికి దిక్కులేకుపోయంది.
టెట్ ఫీజు బీఆర్ఎస్ హయాంలో రూ. 250 ఉండే. గతంలో నిరుద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటున్నదని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసిన్రు. మేం అధికారంలోకి రాగానే అప్లికేషన్లు అన్ని ఫ్రీ అని చెప్పిన్రు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టెట్ ఫీజు రూ. 750కి పెంచిన్రు. గురుకులాలకు వెయ్యి రూపాయలు ఫీజు తీసుకుంటున్నరు. అభ్యర్థులను దోచుకుంటున్నరు. ఒక అభ్యర్థి డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ రాస్తే నాలుగు వేలు వసూలు చేస్తున్నరు. అబద్ధాలు ఆడి నిరుద్యోగులను మోసం చేయడం కాంగ్రెస్‌కు భావ్యం కాదు.
– కృష్ణ, నిరుద్యోగి, అశోక్‌నగర్.
జాబ్ క్యాలెండర్ ప్రకటించిన నుంచి కాంగ్రెస్ సర్కారు రోజుకో కారణం చెప్పి తప్పించుకుంటున్నది. కమిటీ వేయడం.. సాగదీయడం అలవాటుగా మారింది. మొదట ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఆ తర్వాత కుల గణన అంటూ కాలం గడిపిం ది. ఆ తర్వాత ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో సిలబస్ కమిటీ వేశారు. ఇంత వరకు సిలబస్ కమిటీ ఒక్క సారి కూడా సమావేశం కాలేదు. సిలబస్‌పైనా తేల్చలేదు. ఆ తర్వాత జోనల్ సిస్టం మా ర్చాలన్న అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఎట్లాగూ ఆగస్టులో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. కోడ్ నెపంతో నెలన్నర రోజులు గడుస్తుంది. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలొస్తాయి. అయితే దీనిని నిరుద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కొలువుల కోసం నిరుద్యోగులు పోరుబాట పట్టారు. ఓయూలో రెండు వారాల క్రితం నిరుద్యోగుల ఆందోళనతో ఆర్ట్స్ కాలేజీ దద్దరిల్లింది. అశోక్‌నగర్‌లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరంతరం సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాలు ధర్నాలు, నిరసనలు అధికమయ్యాయి. ఈ లైబ్రరీలో ఎలాంటి సభలు, సమావేశాలు జరపొద్దని సర్క్యూలర్ జారీచేశారు. మరోవైపు ‘మీకు జాబ్ వచ్చింది.. మరీ మాకొచ్చేదెప్పుడు’ అంటూ నిరుద్యోగులు కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. సోమవారం చిక్కడపల్లి లైబ్రరీలో ఓ నిరుద్యోగి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్నుద్ధేశించి ‘ అన్నా నీకు జాబ్ వచ్చింది.. మరీ మాకెప్పుడు’ అంటూ నిలదీశారు. మూడు రోజుల క్రితం గాంధీభవన్‌లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ను కలిసి జాబ్ క్యాలెండర్‌పై నిలదీశారు. ఇదిలా ఉంటే కొందరు కాంగ్రెస్ నేతలు నిరుద్యోగులను తీవ్రంగా అవమానిస్తున్నారు. ‘పౌరుషమున్న నిరుద్యోగులు లైబ్రరీలో ఉంటారు. వయోపరిమితి తీరినవారే రోడ్డెక్కుతున్నారు’ అంటూ కాంగ్రెస్ నేత మానవతారాయ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు 1.4లక్షలున్నాయి. నిరుద్యోగులేమో 35 లక్షల మంది ఉన్నారు. అందరికీ ఉద్యోగాలివ్వలేం. అందుకే స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చాం. స్కిల్స్ నేర్చుకోండి.. లేదం టే రాజీవ్ యువ వికాసం కింద రుణాలిప్పిస్తామంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తాచూపుతామని నిరుద్యోగ జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు. ‘నోటిఫికేషన్లు ఇస్తే సక్కగ చదువుకుంటాం.. లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేస్తం.. కాంగ్రెస్‌కు మా తడాఖా చూపిస్తామంటూ’ ఓ నిరుద్యోగి హెచ్చరించారు. ఉద్యోగులం కావాల్సినోళ్లం.. సర్పంచ్‌లు. ఎంపీటీసీలయ్యి మీ భరతం పడతామంటున్నారు.
త్వరలో అనే పదమే నిరుద్యోగులకు నచ్చదు. నేను త్వరలో నోటిఫికేషన్లు అంటే నమ్మి తండా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన. త్వరలో అనే పీడకలలు మమ్మల్ని పీడిస్తున్నాయి. మీ త్వరలో సల్లగుండ. త్వరలో అనే పదానికి కాంగ్రెస్‌కు పేటెంట్ హక్కు ఇప్పిస్తాం. త్వరలో అని చెప్పి మా జీవితాలు నాశనం చేయకండి. ప్రైవేట్ జాబ్‌కు వెళితే ఇన్నాళ్లు ఏం చేసినవు అని అడుగుతున్నరు. కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇప్పించండి.
-శ్రీనివాస్, అశోక్‌నగర్
రాష్ట్రంలో భర్తీచేసేందుకు ఖాళీల్లేవు. మొత్తం ఖాళీలు 32వేలు మించేలా లేవు. ఇటీవల రిటైర్డ్ అయిన పోస్టులు కలుపుకుంటే మరో 10వేలు పోస్టులు చేరే అవకాశం కనిపిస్తున్నది. దీంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై కత్తికట్టింది. పలుశాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధంచేసింది. దాదాపు 25వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అవుతున్నది. శాంతికుమారి నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇవ్వగానే ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న 25 వేల మంది చిరు ఉద్యోగులను తొలగించే అవకాశముందని ఆయా ఉద్యోగులు వాపోతున్నారు.
నిరుద్యోగ యువతను వలలో వేసుకునేందుకు కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించింది. ఈ డిక్లరేషన్‌ను మ్యానిఫెస్టోలో పొందుపరిచింది. ఈ డిక్లరేషన్‌లో ప్రకటించిన ఒక్క హామీని కూడా ఈ 16 మాసాల్లో నెరవేర్చేలేదు. ఉద్యోగాలొచ్చే వరకు నెలకు రూ. 4వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.. మోసం చేశారు. అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలిస్తామన్నారు.. దోకాచేశారు. 5లక్షల విద్యాభరోసా కార్డు, రూ. 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వనేలేదు. ఇస్తామన్న 2లక్షల ఉద్యోగాల భర్తీ హామీలను అటకెక్కించింది. ఆఖరికి ఏడాదిలో ఒకసారే ఫీజు వసూలుచేస్తామని చెప్పి, టెట్, డీఎస్సీ వంటి పరీక్షలకు వెయ్యి, రెండువేల ఫీజులు గుంజుతున్నది.
ఇదిలా ఉండగానే ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల లెక్కలంటూ మాజీ సీఎస్ శాంతికుమారి నేతృత్వంలో కమిటీ వేశారు. ఖాళీల వివరాలు తేల్చేందుకు ఈ కమిటీని నియమించింది. ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, పీఆర్సీ కమిటీ చైర్పర్సన్ శివశంకర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 60 రోజుల్లో ఖాళీలను తేల్చి సర్కారుకు నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించారు. 17వేల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ రెడీగా ఉందని ఇటీవలే మంత్రి పొన్నం ప్రకటించారు. 22వేల ఉద్యోగాలను 2026 మార్చిలోపు నోటిఫికేషన్లు ఇస్తామని పొన్నం ప్రకటించారు. ఇటీవలే కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ ఆరేడు నెలల్లో కొత్త నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. ఇలా ఒక్కో నేత ఒక్కో రకంగా మాట్లాడుతూ నిరుద్యోగులను మభ్యపెడుతున్నారు.