యాదాద్రి భువనగిరి, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : పేదల భూములు, ఇండ్ల స్థలాలపై కాంగ్రెస్ సర్కారు కన్నేసింది. దశాబ్దాలుగా ఉన్న ఆస్తులను ఒక్క సంతకంతో ఆగం చేసింది. ఉన్న పళంగా నిషేధిత జాబితాలో చేర్చి దెబ్బకొట్టింది. కనీసం నోటీసులు కూడా జారీ చేయకుండా వేలాది ఇండ్లు, భూములపై దాష్టీకం ప్రదర్శించింది. ఏ వివాదం, కోర్టు కేసులు లేకున్నా పేదలపై ప్రతాపం చూపింది. క్రయ విక్రయాలు జరగకుండా, రుణాలు తీసుకోకుండా అడ్డుపుల్ల వేసింది. ప్రభుత్వం తీరుతో వేలాది కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. జిల్లాలో సుమారు 8 లక్షల జనాభా ఉంటుంది. ఇక్కడ 2 లక్షల వరకు ఇండ్లు ఉన్నాయి. ప్రభుత్వం ఆదేశమో.. లేక జిల్లా అధికారుల సొంత నిర్ణయమో తెలియదు గానీ చడీచప్పుడు లేకుండా ఇండ్లు, భూములన్నీ 22-ఏలో పొందుపరిచారు. ఒక్కటి కాదు రెండు కాదు.. ఏకంగా యాదాద్రిలో 39,468 ఇండ్లు, 28,549 ఎకరాలు భూములను పీవోబీలో చేర్చారు. ఇందులో అత్యధికంగా భువనగిరి మండలంలో 5వేల ఇండ్లు 22-ఏలో పెట్టారు. ఆ తర్వాత తుర్కపల్లిలో 4803, చౌటుప్పల్లో 3173, వలిగొండలో 2894, యాదగిరిగుట్టలో 2576, రామన్నపేటలో 2529, పోచంపల్లిలో 2519 ఇండ్లతోపాటు మిగతా మండలాల్లోనూ నిషేధిత జాబితాలో కలిపారు. తుర్కపల్లి మండలంలో 4229 ఎకరాలు, రాజాపేటలో 3352 ఎకరాలతోపాటు అన్ని మండలాల్లో కూడా పీవోబీలో చేర్చారు. కొన్ని చోట్ల ఏకంగా ప్రైవేట్ భూములను కూడా నిషేధిత జాబితాలో పెట్టినట్లు తెలిసింది. ఇంకొన్ని చోట్ల గ్రామాలకు గ్రామాలే 22-ఏలో పెట్టారు. అయితే ఇవన్నీ వివాదంలో ఉన్నవో, కోర్టు కేసుల్లోనో ఉన్నాయనుకుంటే పొరపాటే. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా నిషేధిత జాబితాలో పొందుపరిచారు.
ఆయా ప్రాంతాల్లో ఐదారు దశాబ్దాలుగా పేదలు ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. ఇంటి నంబర్లు తీసుకొని.. గ్రామాలు, మున్సిపాలిటీలో ఠంఛనుగా పన్నులు చెల్లిస్తున్నారు. విద్యుత్, నల్లా కనెక్షన్లు తీసుకున్నారు. బ్యాంక్ రుణాలు పొందారు. కొందరు ఇతర అవసరాలకు అమ్ముకున్నారు. ఇంకొందరు వాటిల్లోనే నివాసం ఉంటున్నారు. పీవోబీలో చేర్చడంతో క్రయ విక్రయాలు చేయడం కుదరదు. ఇండ్లు, భూములు రిజిస్ట్రేషన్లు కావు. అవసరం ఉన్నోళ్లకు బ్యాంకు నుంచి రుణాలు రావు. నాలుగైదుసార్లు రిజిస్ట్రేషన్లు అయిన ఇండ్లు, భూములను సైతం ఇప్పుడు నిషేధిత జాబితాలో పెట్టడంతో లబ్ధిదారులు అవాక్కయ్యారు. దశాబ్దాలుగా లేనిది ఇప్పుడే ఎందుకు బ్లాక్ చేశారో అధికారులే చెప్పలేని దుస్థితి నెలకొంది. మరోవైపు 22-ఏలో చేర్చడంతో వాటికి విలువ లేకుండాపోతున్నది. ఇప్పుడు అమ్మడానికి వీలు లేకపోవడంతో నోటరీ ప్రక్రియ దిక్కయ్యింది. దీంతో ధరలు సగానికి సగం పడిపోతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలు జిల్లాలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. లబ్ధిదారులు వివిధ అవసరాల నిమిత్తం తమ ఇండ్లను, పొలాలను అమ్ముకుందామని పోతే.. పీవోబీలో ఉందని అధికారులు చావు కబురు చల్లగా చెబుతుండటంతో పరేషాన్ అవుతున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బాధితులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక్కొక్కరుగా రోడ్లపైకి వచ్చి సర్కార్ దాష్టీకాన్ని ఎండగడుతున్నారు. నిరసనలు, ధర్నాలు, దీక్షలు చేస్తున్నారు. దీనికి బీఆర్ఎస్ నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను కలసి తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మాత్రం కల్లిబొల్లి మాటలు చెప్తూ.. తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పీవోబీలో నుంచి తొలగించడానికి కోర్టులు ఒక్కటే సరైన మార్గమని సీనియర్ రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అక్కడి నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకుంటే నిషేధిత జాబితా నుంచి తొలగించే వీలుంటుందని పేర్కొంటున్నారు.
మాది ఆలేరు మున్సిపాలిటీ రామ్శివాజీ నగర్. ఇంటి నంబర్ 3-152. మా తాత పోరెడ్డి నరసయ్య 1960లో మంగలి పోచయ్య దగ్గర ఇల్లు కొన్నారు. ప్రస్తుతం ఇల్లు మా తండ్రి పేరు మీద ఉంది. అప్పటి నుంచే ఆస్తి పన్ను చెల్లిస్తున్నాం. కానీ ఇటీవల అధికారులు 22-ఏలో పెట్టారని చెప్తున్రు. 1960 కొంటే.. ఇప్పుడు పీవోబీ పెట్టడం ఏంటి..? అసలు ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది..? పేదల పొట్టలు కొడితే ఏం వస్తుంది..? వెంటనే నిషేధిత జాబితాలో నుంచి తొలగించాలి.
