Anaya Bangar : భారత మాజీ క్రికెటర్ సంజయ బంగర్ కూతురు అనయా బంగర్ (Anaya Bangar) లింగ మార్పిడి సర్జరీ చేయించుకుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించింది. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన తండ్రికి ధన్యవాదాలు చెప్పింది. థాయ్‌లాండ్‌లో తనకు విజయవంతంగా సర్జరీ పూర్తైందని చెప్పిన అనయా.. తన వ్యక్తిగత జీవితంలో ముఖ్యమైన దశ నిజమైన తీరును సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించింది.
క్రికెటరైన సంజయ్ బంగర్, కశ్మీరా (వైశాలి) దంపతులకు ఇద్దరు కుమారులు. మొదటి అబ్బాయి పేరు అథర్వ, రెండో కుమారుడి పేరు పుట్టి.. అర్యన్. ఈ ఇద్దరిలో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆర్యన్ అండర్ -16, అండర్ -19 క్రికెటర్‌గా రాణించాడు. కానీ, వారసుడు ఇప్పుడు ఆర్యన్ కాస్త అనయాగా అంటే అమ్మాయిగా మారాడు. కొన్నాళ్లుగా ట్రాన్స్‌జెండర్ విమెన్‌గా వార్తల్లో నిలిచిన అనయా బంగర్ థాయ్‌లాండ్‌లో లింగ మార్పిడి సర్జరీ చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది.
‘ఈ ప్రయాణం నాకే కాదు నా కుటుంబానికి అంత తేలికగా జరుగలేదు. అర్ధ చేసుకోవడం, అంగీకరించడం.. నాకు మద్దతుగా నిలిచేందుకు సమయం పట్టింది. ఇదంతా వెంటనే జరిగిపోలేదు. కొన్ని సందర్భాల్లో అయోమయానికి లోనయ్యాం. ఎన్నో ప్రశ్నలు చుట్టుముట్టాయి. ఎట్టకేలకు ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను. ఎంతో కృతజ్ఞతతో నా మనసు నిండిపోయింది. నా జీవితంలోని ముఖ్యమైన ఈ దశలో నాన్న నా వెన్నంటే ఉన్నారు. ఆయన మద్దతు కాస్త ఆలస్యమైనా.. పూర్తిగా నాపై ప్రేమ చూపారు. ఈ సర్జరీ నా జీవితంలో పెద్ద అడుగు. నాన్న నా పక్కన ఉండడం వల్లనే ఇది సాధ్యమైంది. ప్రేమ, ఎదుగుదల.. ఈ రెండూ సమయం తీసుకుంటాయి. ఒక్కసారి ఇవి మన జీవితంలోకి వచ్చాయంటే అన్నిటికంటే విలువైనవిగా మిగిలిపోతాయి. అందుకని నాన్నకు ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను’ అని అనయా బంగర్ తన భావోద్వేగాలను పంచుకుంది.
2023లో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయించుకున్న అనయా ఆ థెరపీ దశలను వెల్లడించడం పెద్ద దుమారం రేపింది. ఈ క్రమంలో తీవ్ర విమర్శలు ఎదురైనా సరే అనయా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. భవిష్యత్‌లో అమ్మాయిగానే తనను తాను ఊహించుకున్న ఆమె.. ఎట్టకేలకు లింగ మార్పిడి సర్జరీ చేయించుకుంది.