నెన్నెల, మార్చి 22 : హాస్టల్లో సమస్యలను అధికారులకు విన్నవిస్తే వార్డెన్‌తో పాటు సిబ్బంది వేధిస్తున్నారంటూ ఆదివారం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల ఎదుట విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. హాస్టల్లో తగిన వసతులు లేవని, భోజనం సక్రమంగా ఉండడం లేదని అధికారులు, విద్యార్థి సంఘాల నాయకులకు ఫిర్యాదుచేశామని చెప్పారు. నాసిరకం భోజనం పెడుతుండడంతో పలు సార్లు అనారోగ్యం పాలయ్యామని ఆవేదన వ్యక్తంచేశారు. శరీరంపై దద్దుర్లు, మచ్చలు ఏర్పడితే వార్డెన్ చేతికి వచ్చిన ట్యాబ్లెట్లు ఇస్తున్నారని చెప్పారు. డాక్టర్లకు చూపించడం లేదని, మెడికల్ క్యాంపు నిర్వహించడంలేదని ఆరోపించారు. తమ సమస్యలను విద్యార్థి సంఘాలకు చెప్పినందుకు వార్డెన్, సిబ్బంది తమను వేధిస్తున్నారని వాపోయారు. విద్యార్థులకు మద్దతుగా సర్పంచ్ గంగారాం, ఉప సర్పంచ్ బైరి సాయి, వార్డు సభ్యుడు దేవాజీ, ఏఐఎస్బీ జిల్లా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల సన్నీ, డీకొండ జతిన్ పాల్గొన్నారు.