సిటీ బ్యూరో, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించి, అందుబాటులోకి తెచ్చిన సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్‌ను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జూబ్లీహిల్స్‌లో ఓడించి బుద్ధిచెప్పాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్‌నగర్‌లోని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనాన్ని శుక్రవారం కొప్పులతోపాటు మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు బాల సుమన్, దుర్గం చిన్నయ్య, రవిశంకర్, రసమయి బాలకిషన్, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, మేడే రాజీవ్ సాగర్ సందర్శించారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన వసతులను పరిశీలించారు.
కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ‘కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు దళితులు, గిరిజనుల సమస్యలను అధ్యయనం చేసే పరిశోధనలు జరగాలనే ఉద్దేశంతో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్‌ను ప్రారంభించారన్నారు. కేసీఆర్ రూ.24 వేల కోట్లతో భవన నిర్మాణం, రూ.12 కోట్లతో వసతులు కల్పించారని చెప్పారు. దీనిపై ఒక్క రివ్యూ చేయని సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఒక్కో డివిజన్‌కు ముగ్గురి చొప్పున మంత్రులను నియమించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేదర్ అభయ హస్తం పేరిట రూ.12 లక్షలు ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. 59 దళిత ఉప కులాలన్నింటినీ కలిపి మూడు కార్పొరేషన్లు పెట్టి, ఒకో కార్పొరేషన్‌కు రూ.750 కోట్లు కేటాయిస్తామని మాట తప్పిందని ఆరోపించారు.
23 నెలల కాంగ్రెస్ పాలనలో దళితులకిచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా నట్టేటా ముంచింది. తెలంగాణలోని 18 లక్షల దళిత కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తూ అభివృద్ధి ఫలాలు అందించారు. దళితులను మేధావులను చేయాలని కేసీఆర్ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కోసం రూ.36 కోట్లను ఖర్చు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను ఓడించి రేవంత్‌రెడ్డికి దళితుల సత్తా ఏంటో చూపిద్దాం.
కాంగ్రెస్ పార్టీకి, రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వంతపాడుతున్న ఎంఐఎంకు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడించి ఆ రెండు పార్టీలకు చెంప పెట్టులాంటి తీర్పునివ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద పుస్తకాలు పెట్టడానికి డబ్బులు లేవా? దళిత సామాజికవర్గంలో పుట్టిన భట్టి విక్రమార్కకు దళితులు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అడుగడుగునా అవమానించారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సచివాలయానికి ఆయన పేరు పెట్టి సముచిత స్థానం కల్పించారు. అంబేద్కర్‌ను అడుగడగునా అవమానాలకు గురిచేసింది. అందుకే జూబ్లీహిల్స్ దళితులు కాంగ్రెస్‌ను ఓడించి బుద్ధి చెప్పాలి.