సిటీ బ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): మోసాలు, నమ్మకద్రోహాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నది. శాసనసభ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసి గెలిచింది. అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేసింది. ఆ తర్వాత కంటోన్మెంట్లో దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత అకాల మరణంతో వచ్చిన ఉప ఎన్నికలోనూ అదే పంథా కొనసాగించింది. కంటోన్మెంట్ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపింది. అమలు కాని హామీలను ఇచ్చి కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టింది. ఉప ఎన్నికలో గెలుపొందాకా మొండిచేయి చూపింది. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో కంటోన్మెంట్ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు.
కనీసం బీఆర్ఎస్ హయాంలో నిర్మించి సిద్ధంగా ఉంచిన డబుల్ బెడ్ రూం ఇండ్లను కూడా పంపిణీ చేయకుండా పేద ప్రజలతో ఆడుకుంటున్నది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ కంటోన్మెంట్ ప్రజలను మోసం చేసినట్లుగానే మభ్యపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ఉపఎన్నిక ప్రచారంలో మంత్రులంతా నియోజకవర్గంలో గద్దల్లా వాలారు. ఎక్కడికక్కడ శంకుస్థాపనలు చేసి రూ.కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కంటోన్మెంట్ ప్రజలు స్వచ్ఛందంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ కాంగ్రెస్ మోసాలను ఎండగడుతున్నారు. తమలా జూబ్లీహిల్స్ ప్రజలూ మోసపోవద్దని ఇంటింటికీ తిరిగి చెప్తున్నారు.
కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ప్రజలకిచ్చిన ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు. రక్షణ శాఖ పరిధిలో నివసిస్తున్న వేలాది మంది ప్రజలకు ఇండ్ల పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములను భూబదలాయింపు చట్టం ద్వారా రాష్ట్రం ప్రభుత్వం పరిధిలోకి తీసుకుని.. ఆ ప్రాంతంలో నివసిస్తున్న సుమారు 15 వేల కుటుంబాల ఇండ్లను రెగ్యులరైజ్ చేసి పట్టాలిస్తామన్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా దానిపై రక్షణ శాఖతో కనీసం సంప్రదింపులు కూడా చేపట్టలేదు. గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల కంటే కంటోన్మెంట్ నియోజకవర్గానికి భారీ మొత్తంలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
కంటోన్మెంట్ ప్రజలకు 6000 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఇవ్వకుండా మోసం చేశారు. కంటోన్మెంట్ అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు తీసుకొస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ మాటిచ్చారు. రెండేండ్లయినా ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. కనీసం కంటోన్మెంట్ ప్రజల విషయమై ఒక్కసారి కూడా ఢిల్లీకి వెళ్లలేదు. కంటోన్మెంట్లో రూ.23 కోట్ల వ్యయంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని గప్పాలు కొట్టారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే నిధులు కూడా మంజూరయ్యాయని అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఉలుకూ లేదు పలుకూ లేదు.
అల్వాల్-బొల్లారం మధ్య గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వెయ్యి పడకలతో టిమ్స్ దవాఖాన నిర్మాణం చేపట్టారు. పనులు 90 శాతం పూర్తయ్యాయి. కాంగ్రెస్ ఏర్పడి రెండేండ్లవుతున్నా పనులు ముందుకు సాగలేదు. గత ప్రభుత్వంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అదేవిధంగా దర్శనమిస్తున్నది. పరేడ్ గ్రౌండ్లో కంటోన్మెంట్ ప్రజలకు హెల్త్ ప్రొఫైల్ పేరిట భారీ క్యాంపు ఏర్పాటు చేసి.. అనారోగ్య సమస్యలున్న వారి వివరాలు సేకరిస్తామన్నారు. వారికి ప్రత్యేకంగా కార్డులు జారీచేసి చికిత్స అందిస్తామని ప్రకటన చేశారు. ఇప్పటి వరకు అలాంటి కార్యక్రమాలేమీ చేపట్టలేదు. ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాలేమీ చేయకపోగా బస్తీ దవాఖానల్లో మందుల కొరత వేధిస్తున్నది. అన్ని దవాఖానల్లో కాలంచెల్లిన మందులు పంపిణీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హామీలన్నీ అమలు చేస్తానని మోసం చేసి గెలుపొందిన శ్రీగణేష్ కంటికి కనిపించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లన్నీ గుంతలమయమై ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త రోడ్లు నిర్మిస్తామని, మరమ్మతులు చేపడతామని హామీ ఇచ్చి గెలిచాక ముఖం చాటేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు జూబ్లీహిల్స్‌లో ఇంటింటికీ తిరిగి వివరిస్తున్నారు. ఉప ఎన్నికలో తమపై హామీల వర్షం కురిసిన కాంగ్రెస్ నిలువునా ముంచిందని తమ ఆవేదనను పంచుకుంటున్నారు. హామీలన్నీ అమలు చేస్తామని అహ నా పెళ్లంటలో కోట శ్రీనివాసరావు కోడిని ముందు ఉంచుకుని చికెన్‌తో భోజనం చేస్తున్నట్లు తమ పరిస్థితి మారిందని కోడిని చూపిస్తూ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి తాము మోసపోయినట్లు జూబ్లీహిల్స్ ప్రజలు కూడా మోసపోవద్దని సూచిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే జూబ్లీహిల్స్ ప్రజలకు తమ పరిస్థితే వస్తుందని వివరిస్తున్నారు. కంటోన్మెంట్ ప్రజల పరిస్థితి జూబ్లీహిల్స్‌లో రావొద్దని కోరుతున్నారు. ఇంటింటికీ తిరిగి ప్రజలను చైతన్యం చేస్తున్నారు.