సిటీ బ్యూరో, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ‘నేను 1978 నుంచి రాజకీయాల్లో ఉన్న.. అప్పట్లో నాకు 15 ఏండ్లు ఉన్నప్పుడే దొంగ ఓటేసి ఎమ్మెల్యేను గెలిపించుకున్న..’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ స్వయంగా ఓ నిండు సభలో అందరి ముందూ పంచుకున్నవి. అంతే కాకుండా ‘రౌడీలు.. రౌడీలు.. అంటున్నరు. రౌడీలంటే మంచోళ్లు. వాళ్లు ఎవరూ పరిష్కరించలేని పంచాయితీలను తీర్మానిస్తరు’ ఇవి ఇటీవల ఓ సమావేశంలో శ్రీశైలం యాదవ్ మాట్లాడిన మాటలు.
ఇప్పుడీ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. వాట్సాప్ గ్రూపులు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ వేదికగా ట్రెండింగ్‌లో ఉన్నాయి. దీంతో జూబ్లీహిల్స్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి తండ్రి నిర్మొహమాటంగా, ఎలాంటి జంకూ లేకుండా రౌడీయిజం, దొంగ ఓట్ల గురించి మాట్లాడుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అలాంటి కుటుంబం నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే తమ పరిస్థితి ఏంటనే సందిగ్ధంలో ఉన్నారు. ఆయనను గెలిపిస్తే నియోజకవర్గంలో రౌడీయిజం, దొంగ ఓట్లు పెరిగిపోతాయని భయపడుతున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ దొంగ ఓట్ల గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఏకంగా ఆయనే 15 ఏండ్ల వయస్సులో దొంగ ఓటేసి ఎమ్మెల్యేను గెలిపించుకున్నామని చెప్తున్నారు. ఇదే స్ఫూర్తితో జూబ్లీహిల్స్‌లో వేలాదిగా దొంగ ఓట్లు సృష్టించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇతర నియోజకవర్గంలోని తమకు అనుకూలమైన వారి పేర్లను జూబ్లీహిల్స్ ఓటర్ల జాబితాలో చేర్చి బోగస్ ఓట్లను సృష్టించారనే ప్రచారం జరుగుతున్నది. మరోవైపు ఇతర జిల్లాలతో పాటు ఏపీలోని కొంతమంది పేర్లను చేర్చి వారి పేరిట ఇక్కడి వారే ప్రతిసారీ ఓట్లేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారమంతా శ్రీశైలం యాదవ్ కనుసన్నల్లో జరుగుతుందని జూబ్లీహిల్స్ ప్రజలు చెప్తున్నారు.
అందులో భాగంగానే ఇటీవల బీఆర్ఎస్ చేసిన క్షేత్రస్థాయి పరిశీలనలో బయటపడ్డ బోగస్ ఓట్ల బాగోతం ఉదాహరణగా నిలుస్తున్నది. ఒక్కో ఇంట్లో ఏకంగా 50 నుంచి 100 ఓట్లదాకా చేర్చారు. అందులోని వారంతా అక్కడ ఎన్నడూ నివసించని వారే. కొన్ని కాలనీల్లోని చిరునామాల్లో ఉన్న బోగస్ ఓట్లు దాదాపుగా ముస్లింలవే ఉండటం కలచివేస్తున్నది. 30 నుంచి 40 ఏండ్లుగా అసలు ముస్లింలేని కాలనీల్లోని ఇండ్లలో పదుల సంఖ్యలో ముస్లింల ఓట్లు బయటపడ్డాయి. ఆ బోగస్ ఓట్లన్నింటినీ పకడ్బందీగా పక్కా ప్లాన్‌తోనే సంబంధిత చిరునామాల్లో చేర్చినట్లు స్పష్టం అవుతున్నది. శ్రీశైలం యాదవ్‌తో పాటు ఆయన అనుచరులకు ఏండ్ల తరబడిగా ఇలా దొంగ ఓట్లను సృష్టించడం అలవాటుగా మారిందని స్థానికులు చెప్తున్నారు. ఇప్పుడు ఏకంగా నవీన్ యాదవ్ పోటీలో నిలబడటంతో వారికి నచ్చినన్ని దొంగ ఓట్లను సృష్టించుకుని ఉంటారని జూబ్లీహిల్స్ ఓటర్లు ఆరోపిస్తున్నారు.
శ్రీశైలం యాదవ్ వీడియోలు సోషల్ మీడియాల్లో చూసిన జూబ్లీహిల్స్ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పదేండ్ల మాగంటి గోపీనాథ్ పాలనలో ప్రశాంతంగా ఉన్న జూబ్లీహిల్స్ అదేవిధంగా కొనసాగాలంటే మాగంటి సునీతనే గెలిపించాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిస్తే శ్రీశైలం యాదవ్ అరాచకాలు మళ్లీ మొదలవుతాయని ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల ముందే రౌడీయిజం, దొంగ ఓట్లు, పంచాయితీల గురించి మాట్లాడుతున్న నవీన్ యాదవ్ కుటుంబం.. ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రశాంతంగా ఉన్న జూబ్లీహిల్స్ రూపురేఖలనే మార్చేస్తారని చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నా ఇదే చర్చ జరుగుతున్నది. మాగంటి సంక్షేమ పాలన కొనసాగాలంటే నవీన్ యాదవ్‌ను ఓడించాలని చర్చించుకుంటున్నారు. దినసరి కూలీల నుంచి వ్యాపారుల దాకా అందరూ సంతోషంగా జీవించాలంటే మాగంటి కుటుంబంతోనే సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి తిరిగి కొనసాగాలని కాంక్షిస్తున్నారు.