నిజామాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులకు ధైర్యంగా ఉండాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వమే మొన్నటి వరకు ఇష్టారీతిన భయాలు సృష్టించింది. ఎల్నినో పేరిట అవగాహన సదస్సులు నిర్వహించి ఆరుతడి పంటల వైపు అన్నదాతలను మళ్లించేందుకు ఆలస్యంగా ప్రయత్నాలు చేసింది. అప్పటికే 70శాతానికి పైగా వరి నాట్లు పూర్తవ్వగా మిగిలిన చోట్ల పుటం వేసుకుని రైతులు సిద్ధం ఉన్నారు. ఎల్నినో ప్రభావంతో పది రోజుల క్రితం వరకు ఎండలు, ముసురేసిన మబ్బులతో విభిన్నమైన వాతారవణం కనిపించింది. అయినప్పటికీ రైతన్నల్లో ఆరుతడి పంటల వైపు వెళ్లాలనే ఆలోచన రాలేదు. అప్పటికే వరి నారుమడులు సిద్ధం చేసుకోవడమే ప్రధాన కారణం.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణితో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చిరు జల్లులతో మొదలైన వర్షం కాస్తా భారీ వానకు దారి తీసింది. జూలై 28నుంచి కురుస్తోన్న ఏకధాటి వానలతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు ఎస్సారెస్పీ, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లోకి ఇన్ఫ్లో నమోదు అవుతోంది. క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. మహారాష్ట్రలో వరదలు వస్తే ఎస్సారెస్పీకి భారీగా వరద వచ్చే వీలుంది. ఎల్నినో పేరు చెప్పి రైతులను కాంగ్రెస్ ప్రభుత్వమే గందరగోళంలో ముంచెత్తింది. విస్తృత ప్రచారం పేరుతో ఎల్నినో అంటే భయానక స్థితిని తీసుకు వచ్చింది. సర్కారు మాటలు విని ఒక వేళా ఆరుతడి పంటలకు సిద్ధమైతే ఈ భారీ వానలతో రైతులకు అదనపు నష్టం మిగిలి ఉండేదన్న చర్చ నడుస్తోంది. ఈ వానల మూలంగా నెల రోజుల పాటు పంటలకు ఎలాంటి ఢోకా ఉండబోదని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఆగస్టు, సెప్టెంబర్లో పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యవసాయ రంగంపై సరైన వ్యూహం లోపించిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. వానాకాలం సీజన్లో ఎల్నినో ప్రభావం ఉందంటూ ప్రచారం నిర్వహిస్తోంది. నిజామాబాద్ లాంటి జిల్లాలో యాసంగి ముగియడంతోనే నాట్లు వేసే ఆనవాయితీ ఉంది. ఈ ప్రాంతాల్లో ముందస్తుగానే సమీక్షలు, సమావేశాలు నిర్వహించాల్సి ఉండగా జూలై చివరి వారంలో తూతూ మంత్రంగా సమావేశం పెట్టి రైతులను అప్రమత్తం చేశారు. అప్పటికే 70శాతం ప్రాంతాల్లో వరి నాట్లు పూర్తవ్వగా ప్రస్తుత వర్షాలకు అంతటా వరి పంటలే సాగు చేశారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న కొన్ని చోట్ల యథావిధిగా మొక్కజొన్న, సోయాబీన్, ఇతర అపరాల సాగుకు రైతులు ముందడుగు వేశారు.
ఎల్నినో పరిస్థితుల్లో తమకు వాతావరణం లాభం చేస్తుందని భావించారు. ఏకధాటి వానలతో పొలాల్లో నీరు నిలిచి ఆరుతడి పంటలకు ప్రమాదం దాపురించింది. ప్రభుత్వానికి అధికారిక సమాచారమే అందుబాటులో ఉంటుంది. పక్కా సమాచారం మేరకే ఎల్నినో పేరుతో రైతులను అప్రమత్తం చేసిందని అంతా అనుకున్నారు. అందుకు భిన్నంగా భారీ వర్షాలు రావడం, లోటు వర్షపాతం దాటుకుని సాధారణ వర్షపాతం నమోదు కావడం విస్తుగొల్పుతోంది. కాంగ్రెస్ సర్కారుకు అందుతోన్న భవిష్యత్తు వాతావరణ అంచనాల్లో తేడా ఉంటుందా? శాస్త్రీయ సమాచార లోపంతో రైతులను ఆగం చేస్తున్నారా? అనే ప్రశ్న అంతటా ఉద్భవిస్తోంది. కాంగ్రెస్ పెద్దల మాటలు నమ్మి ఆరుతడి విత్తుకున్న వారికి ఈ వానలతో చేటు తప్పా లాభం లేదు. వాళ్లకు ఏమైనా భరోసా ఇస్తారా? నష్టపోతే పరిహారం అందుతుందా? అంటే మోనమే సమాధానం ఉంది.
నిజామాబాద్ జిల్లాలోని మొత్తం 33 మండలాల్లో పది రోజుల క్రితం వరకు లోటు వర్షపాతమే నమోదైంది. కాని ప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారి పోయింది. 25 మండలాల్లో సాధారణ వర్షాపాతం నమోదైంది. సిరికొండలో అత్యధిక వర్షాపాతం నమోదైంది. సాలూర, ఆలూర్, పోతంగల్, ఆర్మూర్, వేల్పూర్, మోర్తాడ్, కోటగిరి మండలాల్లో లోటు వర్షాపాతమే ఉంది. వర్షాలు మరికొద్ది రోజులు ఇలాగే కురిస్తే అధిక వర్షపాతం నమోదయ్యేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది. వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం నిజామాబాద్ జిల్లాలో మొన్నటి వరకు 4.70లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. ఎల్నినో పేరుతో వెనక్కి తగ్గిన రైతులు సైతం మిగిలిన 50వేల నుంచి 70వేల ఎకరాల్లో వరి నాట్లు వేస్తున్నారు.
55వేల ఎకరాల్లో మొక్కజొన్న, 35వేల ఎకరాల్లో సోయాబీన్ ప్రతి వానాకాలం సీజన్ మాదిరిగానే ఈసారి కూడా సాగులోకి వచ్చింది. ప్రస్తుత వర్షాలతో భూగర్భ జలమట్టం కాసింత పెరగడం రైతులకు ఊరటను ఇస్తుంది. మరోవైపు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గ్రామాల్లో చెరువుల్లోకి కాసింత నీటి మట్టం పెరుగుతోంది. నిజాంసాగర్, ఎస్సారెస్పీకి వరద ప్రవాహం మొదలవ్వడంతో వరి పంట సాగు చేసిన రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో మొక్కజొన్న, సోయా, పత్తి, కందులు, పెసర్లు, మినుములు సాగు చేస్తున్నారు. దాదాపుగా 3లక్షల ఎకరాల్లోపు వరి నాట్లకు అవకాశం ఏర్పడినట్లు తెలుస్తోంది.