– ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి
– విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే తీవ్ర పరిణామాలు
– రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర
చుంచుపల్లి, జూలై 25 : దోచుకోవడం.. పంచుకోవడం.. దాచుకోవడం.. తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించే పరిస్థితి లేదని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం ఆధ్వర్యంలో చుంచుపల్లి మండలం ఎన్కే నగర్‌లోని కమ్మ సత్రంలో శనివారం వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఏం తప్పు చేశారని, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఎందుకు సకాలంలో విడుదల చేయడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. 2014లో రూ.56 వేల కోట్లుగా ఉన్న తెలంగాణ బడ్జెట్‌ను కేసీఆర్ ప్రభుత్వం సుమారు రూ.3 లక్షల కోట్లకు తీసుకు వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 10 నుంచి 33కు పెంచడం, కొత్త జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం, ఇంజినీరింగ్ కళాశాలలు, ఇతర విద్యా సంస్థలు, మౌలిక వసతులు కల్పించడం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను గత ప్రభుత్వం చేపట్టిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేయడం మాత్రమే కాకుండా నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేయడం కూడా చేతకావడం లేదని విమర్శించారు. నిర్మించడం, నిలబెట్టడం కాకుండా కూల్చివేయడం, పడగొట్టడం తప్ప ప్రభుత్వం చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు. విద్యార్థుల పరిస్థితిని కూడా పట్టించుకోని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని వీడే సమయంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కేవలం రూ.2 వేల నుంచి రూ.3 వేల కోట్ల వరకు మాత్రమే ఉన్నాయన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు రూ.19,500 కోట్ల విద్యార్థుల రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించలేదా? అని ప్రశ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఏదో ఒక ప్రభుత్వానికి సంబంధించిన పథకం కాదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిరంతర ప్రక్రియ అన్నారు. విద్యార్థులు, యువత సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
విద్యార్థులు, యువత తలుచుకుంటే రాజకీయ పార్టీల భవిష్యత్‌ను మార్చగలరని, వారి ఆగ్రహానికి ప్రభుత్వాలు కూడా సమాధానం చెప్పాల్సి వస్తుందని అన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇటీవల దేశంలో విద్యార్థులు, యువత చేపట్టిన ఆందోళనల కారణంగా కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించాల్సి వచ్చిన పరిస్థితులను ప్రస్తావించారు. విద్యార్థుల ఆందోళనలను తేలికగా తీసుకోకుండా వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కేంద్రంలో ఎదురైన పరిస్థితులను చూసిన తర్వాత కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదని విమర్శించారు. ఇకనైనా ప్రభుత్వం మేల్కొని విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల కోసం నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాలను మరింత విస్తృతం చేసి, అన్ని వర్గాలను కలుపుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు.