హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : సర్కార్ బడులను మరింత నిర్వీర్యం చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ అడుగులేస్తున్నది. పేదలకు నాణ్యమైన ఉచిత విద్యను దూరం చేయబోతున్నది. దీంట్లో భాగంగా సర్కార్ బడుల రేషనలైజేషన్‌కు ప్రభుత్వం ఇటీవలే పచ్చజెండా ఊపింది. కొంతకాలం క్రితం సీఎం రేవంత్ సమక్షంలో జరిగిన సమావేశంలో రేషనలైజేషన్‌కు సర్కార్ అనుమతి ఇచ్చింది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంలో హేతుబద్ధీకరణను చేపట్టనున్నారు. ఈ రేషనలైజేషన్‌తో పదివేల టీచర్‌పోస్టులు గల్లంతుకానున్నాయి. అంటే ఈ పోస్టులున్నా లేనట్టే లెక్క. వీటిని భర్తీచేయరు. రాష్ట్రంలో చివరగా 2015లో రేషనలైజేషన్ చేపట్టారు. ఆ తర్వాత మళ్లీ పదేండ్ల తర్వాత రేషనలైజేషన్ చేపట్టేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది.
దీనిని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రంలో 24,235 సర్కార్ బడులుంటే వీటిల్లో ఎన్రోల్మెంట్ 16,57,812 మాత్రమే. ఇదే బడుల్లో 1.06 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. అంటే ఉపాధ్యాయ- విద్యార్థి నిష్పత్తి 16లోపే ఉంది. కానీ నిబంధనల ప్రకారం 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. రాష్ట్రంలో మంజూరైన టీచర్ పోస్టులు 1,25,583 ఉండగా, 18వేలకుపైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే సర్కార్ బడుల్లో ఎన్రోల్మెంట్ తగ్గుతుండటంతోనే ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి పడిపోతున్నది. ఎన్రోల్మెంట్ పెంచకుండా సర్కార్ రేషనలైజేషన్ చేపట్టనున్నది. ఈ ప్రక్రియతో 10వేలకు పైగా టీచర్ పోస్టులు గల్లంతుకానున్నాయి. ఈ పదేండ్ల కాలంలో మిగులు టీచర్ల సర్దుబాటును మాత్రమే చేపట్టారు. రేషనలైజేషన్ జోలికి వెళ్లలేదు. కానీ కాంగ్రెస్ సర్కార్ రేషనలైజేషన్‌కు అనుమతి ఇచ్చింది. అంటే మెగా డీఎస్సీ, కొత్త టీచర్ రిక్రూట్మెంట్ చేపట్టే అవకాశాలు లేనట్టే.
రేషనలైజేషన్ చేపట్టేందుకు గతంలో జీవో జారీచేశారు. పదేండ్ల క్రితం అప్పటి పరిస్థితులను బట్టి జీవో జారీచేశారు. ఈ జీవోను ఈ సారి ప్రామాణికంగా తీసుకుంటే అస్సలు ఒప్పుకోం. పాత జీవోను మార్చితే, మళ్లీ కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తేనే రేషనలైజేషన్‌కు అంగీకరిస్తాం. పాత జీవోనే అమలుచేస్తామంటే మేం ఉద్యమ బాట పడతాం.
ఇప్పటికే 2వేలకు పైగా జీరో ఎన్రోల్మెంట్ బడులను మూసివేశారు. రేషనలైజేషన్ పేరుతో మిగతా సర్కార్ బడులను మూసివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బడులు మూసివేస్తే అస్సలు ఊరుకోం. ఎన్రోల్మెంట్ తగ్గేందుకు సర్కార్ విధానాలే కారణం. రాష్ట్ర బడ్జెట్లో నిధులు పెంచడంలేదు. మెరుగైన వసతుల్లేవు. దీంతోనే పిల్లల సంఖ్య తగ్గుతుంది. ప్రైవేట్లోనేమో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉంటాయి. సర్కార్ బడుల్లో ఇవి ఉండవు. విద్యార్థి ఒక బడిలో చేరిన తర్వాత మరో స్కూల్‌కు మారగలడా..? అంటే మారడంలేదు. కనుక మూడేండ్లు నిండిన వారిని సర్కార్ బడుల్లో చేర్చుకోవాలి.