ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్న హామీ నెరవేరనే లేదు. రెండేండ్లుగా ప్రభుత్వ ఉద్యోగాలకు సరైన నోటిఫికేషన్లే లేవు. అయినా, ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు రెండు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తెలంగాణకు రప్పించే ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ లేక.. ప్రమోషన్లు త్వరత్వరగా వస్తుండటంతో ఏపీకి చెందిన కొందరు ఉద్యోగులు తెలంగాణకు వచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లో.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ‘సమ్మతి’తో ఏపీ ఉద్యోగులను మన ఉద్యోగులపై రుద్దేందుకు సిద్ధమయ్యారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం వేచిచూస్తున్న నిరుద్యోగ యువతకు మరో పిడుగులాంటి వార్త. కొత్త నోటిఫికేషన్లు జారీ చేయని కాంగ్రెస్ సర్కార్.. ఉన్న ఉద్యోగాలను ఏపీ వారికి కట్టబెట్టేందుకు రెడీ అవుతున్నది. మన ఉద్యోగాలకు గండికొట్టేందుకు సిద్ధమైంది. ఏకంగా రెండువేల ఉద్యోగాలను తెలంగాణ బిడ్డలకు దూరం చేయనున్నది. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న 1,943 మంది ఉద్యోగులను త్వరలోనే తెలంగాణను కేటాయించనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ సర్కార్ వీరిని చేర్చుకోవడం లాంఛనమేనన్న ప్రచారం జరుగుతున్నది. ఇదే జరిగితే ఈ ఉద్యోగాలు మనకు దూరం కావడం ఖాయంగా కనిపిస్తున్నది. కొత్త రిక్రూట్మెంట్, ఉద్యోగుల ప్రమోషన్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఉద్యోగ సంఘా ల నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.రాష్ట్ర విభజన సమయంలో కమలనాథన్ కమిటీ ఉద్యోగుల పంపిణీని చేపట్టింది. అప్పట్లో రాష్ట్ర స్థాయి ఉద్యోగులను మాత్రమే కేటాయించారు. జిల్లా, జోనల్, మల్టీజోనల్ ఉద్యోగులను కేటాయించలేదు. దీంతో విభజన సమయంలో ఏ రాష్ట్రంలో పనిచేస్తున్న వారు అదే రాష్ట్రంలో ఉన్నారు. తెలంగాణ ఉద్యోగులే అధికంగా ఆంధ్రప్రదేశ్లో ఉండిపోయారు. మన బిడ్డలు పరాయి రాష్ట్రంలో బాధలు పడొద్దని గత కేసీఆర్ సర్కార్.. 2,300 పైగా ఉద్యోగులను తెలంగాణకు రప్పించింది. వీరి రాకతో రిక్రూట్మెంట్లు, ప్రమోషన్లకు ఇబ్బందులు కలుగొద్దని, సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేసి, స్థానిక ఉద్యోగులను అక్కున చేర్చుకున్నది. ఏపీ సర్కార్ తెలంగాణకు వెళ్లాలనుకున్న ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించింది. 1,943 మంది ఏపీ ఉద్యోగులు తెలంగాణకు వచ్చేందుకు ఆప్షన్లు ఇచ్చారు. ఉద్యోగుల విభజన – సంప్రదింపులకు ఇరు రాష్ట్రాలు అధికారుల కమిటీని నియమించాయి. 2024లో అధికారుల కమిటీ భేటీ అయ్యింది. ఉద్యోగులు రాష్ట్రం మారేందుకు ఆసక్తిగా ఉన్నారో లేదో తెలుసుకునేందుకు ఏపీజీఏడీ గత నెలలో ఓ సర్క్యులర్ విడుదల చేసింది. 1,943 మందిని తెలంగాణపై రుద్దబోతున్నారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సొంత రాష్ర్టానికి పంపండి మహాప్రభో అంటూ 1,369 మంది ఏపీ ఉద్యోగులు వేడుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ రెండేండ్లుగా ఒక్కరిని కూడా ఏపీకి పంపించలేదు. సీఈఐజీ పోస్టు, టీజీ రెడ్కో వీసీ అండ్ ఎండీ వంటీ కీలక పోస్టులను నెల్లూరు జిల్లాకు చెందిన వారి చేతిలో పెట్టింది. సలహాదారులు సహా అనేక పోస్టుల్లో ఏపీకి అనుకూలంగా వ్యవహరించే వారిని నియమించింది.
ఏపీ ఉద్యోగులు తెలంగాణకు రావడాన్ని రాష్ట్ర ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. వారిని అనుమతిస్తే ఉద్యోగాల భర్తీ, ప్రమోషన్లపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఒకే క్యాడర్లోని ఉద్యోగులను పరస్పర బదిలీల తరహాలో మాత్రమే కేటాయించాలని సూచిస్తున్నాయి. గంపగుత్తగా క్యాడర్, శాఖలతో సంబంధం లేకుండా ఏపీ ఉద్యోగులను అనుమతించొద్దని కోరుతున్నాయి. రాష్ట్రం విడిపోయి 12 ఏండ్లు గడిచినా ఇలాంటి వాటిని తెరపైకి తీసుకొనిరావడం అసందర్భమని, దీనికి ముగింపు పలుకాలని స్పష్టం చేస్తున్నాయి.
కవాడిగూడ, ఫిబ్రవరి 3: ఉద్యోగ నోటిఫికేషన్ల సాధన కోసం తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు వద్ద ‘హలో నిరుద్యోగి – చలో ఇందిరాపార్కు’ పేరుతో మహాధర్నా నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగే ధర్నాలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, అశోక్, విఠల్, పృద్వీరాజ్ తదితరులు పాల్గొననున్నారు.