లహైదరాబాద్, ఫిబ్రవరి 3(నమస్తే తెలంగాణ) : హార్వర్డ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కోట్లు ఖర్చు పెట్టి కాస్ట్లీ చదువులు చదివితే.. రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు పాముకాట్లతో అల్లాడుతున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సంగతి దేవుడెరుగు ఉన్న గురుకులాల పరిస్థితి అధ్వానం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గురుకులంలో మంగళవారం ఇంటర్ విద్యార్థిని అశ్మిత పాముకాటుకు గురై మృత్యువుతో పోరాడుతున్న వార్త తనను తీవ్రంగా కలచివేసిందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి ప్రాణానికి రేవంత్‌రెడ్డే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రేవంత్ పాలనలో గురుకులాలు విషసర్పాలకు ఆవాసాలుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఇది రేవంత్ పరిపాలనా వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు. రూ.20వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటూ రంగుల లోకం చూపిస్తున్న ముఖ్యమంత్రి గురుకులాలను గాలికి వదిలేయడం సిగ్గుచేటు అని విమర్శించారు.
గురుకులాల్లో పిచ్చిమొక్కలు తొలగించే దిక్కు లేదని, చిమ్మచీకట్లో లైట్లు వేసే నాథుడే లేడని మండిపడ్డారు. గురుకుల బిడ్డలకు కడుపు నిండా తిండి లేదు.. ప్రాణాలకు రక్షణ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లి ఫొటోలకు పోజులిస్తే.. రాష్ట్రంలో పేద విద్యార్థులు దవాఖానల పాలై కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. తమ పిల్లలు గురుకులాలకు చదువుకునేందుకు వెళ్తున్నారా? లేక చావుతో పోరాడేందుకు వెళ్తున్నారా అని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని వివరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి గురుకులాలను కాపాడి, విద్యార్థుల భవిష్యత్తును నిలబెట్టాలని కోరారు. అశ్మితకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయ కక్ష సాధింపుల మీద ఉన్న శ్రద్ధలో కొంత అయినా పేద పిల్లల బతుకుపై పెట్టాలని హరీశ్‌రావు హితవు పలికారు.