ఆటలు, అసత్యాలు, అహంకారాభినయాలతో తాజా అసెంబ్లీ సమావేశాలను మొత్తానికి ‘మమ’ అనిపించిన రేవంత్‌రెడ్డి సర్కార్ చివరి అంకంలో పారని పాచికను ప్రతిపాదించి మరింత పలుచనైపోయింది. ‘నూరు పూలు వికసించనీ, వేయి ఆలోచనలు సంఘర్షించనీ’ అనే నినాదం నమ్మిన తెలంగాణ గడ్డ మీద, ఆలోచనలపైనా ఆంక్షలు విధించే పాశవికతకు ప్రభుత్వం పావులు కదుపుతున్నది.
‘హేట్ స్పీచ్’ నివారణ చట్టం పేరిట రాజ్యాంగాన్ని రూపుమాపే ముప్పును తెచ్చిపెడుతుంటే.. సీఎం సలహామండలిలో కొలువైన జర్నలిజం, న్యాయ శాస్త్రం, రాజకీయ శాస్త్రంలో పాండిత్యమేమోకానీ పట్టాలు పొందిన మేధావులు ఏం సూత్రీకరణలు చేసుకొంటున్నారో, ఆత్మవంచనతో ఆలాపనకు ఎలా సిద్ధమౌతున్నారో తెలియదు. మూడేండ్ల కిందట జేఎన్‌యూ, జామియా మిలియా, అలీగఢ్, బెనారస్, హెచ్‌సీయూ తదితర వర్సిటీల్లో జరిగిన పలు సంఘటనల సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఆయన పరివారం వినిపించిన ప్రజాస్వామ్య ప్రవచనాలు గుర్తుకొస్తున్నాయి. విద్యార్థి నేతలు ఉమర్ ఖలీద్, కన్హయ్య కుమార్‌పై మోదీ ప్రభుత్వం మోపిన ఆరోపణలపై రాహుల్ ఊగిపోతూ దేశవ్యాప్తంగా ఇచ్చిన ఉపన్యాసాలు ఎన్నో ఉన్నాయి.
2022 జనవరి 27న రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో ‘సామాజిక మాధ్యమాలను, ప్రజాస్వామ్యాన్ని అధికారంలో ఉన్న పార్టీ లొంగదీసుకొనేందుకు అణచివేత విధానాలను అమలు చేయరాదు. సోషల్ మీడియాను కేవలం తిట్లు, తప్పుడు ప్రచారాలకు పరిమితమయ్యేలా వదిలేయరాదు’ అంటూ చాలా గంభీరమైన పోస్ట్ పెట్టారు.
దాని మీద వ్యక్తమైన అభిప్రాయాలను మరునాడు ‘నేషనల్ హెరాల్డ్’తో పాటు వివిధ పత్రికలు పెద్ద వార్తగానే ప్రచురించాయి. ‘అది గుర్తుచేసుకున్న తర్వాత.. గతమెందుకు..మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లోనే సభలో, సమావేశాల సందర్భంగా మీడియా చిట్చాట్లలో సీఎం.. కులాలు, కుటుంబాల పేరిట తెలంగాణ తెచ్చిన నేతలను దుర్భాషలాడుతూ ఎంత సంస్కారహీనంగా వ్యవహరించారో తెలంగాణ సమాజం మొత్తం చూసింది. ఇలా రోత నోరేసుకున్న ముఖ్యమంత్రే ‘వెయ్యి పీనుగలు తిన్న రాబందు శాకాహార రాగాలాపన’ అందుకున్నట్లు ద్వేష ప్రసంగాల నివారణ నినాదమిస్తే, వినడానికి ఎంతో జగుప్స కలుగడంతోపాటు దాని వెనుక ఉన్న కుట్రకోణం కూడా తేలిగ్గానే అర్థమవుతుంది. రాహుల్ గాంధీకి రేవంత్ సర్కార్ తెచ్చిన ఈ బిల్లు గురించి తెలియదా అంటే..ప్రస్తుత వాట్సప్ యుగంలో ఈ సమాచారం దూరంగా ఉంటుందని అనుకోలేం. కానీ ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆవేదనతో అన్నట్లుగా ‘రాహుల్ కాంగ్రెస్’ కాకుండా ‘రేవంత్‌రెడ్డి కాంగ్రెస్’గా మారిపోయిందని తేటతెల్లమవుతున్నది.
రేవంత్ లాంటి కాంగ్రెస్ చొరబాటుదారులకు లొంగిపోయిన రాహుల్ కుటుంబం, పాత పద్ధతిలోనే విలువల ఉపన్యాసాలు దంచుతూ సంస్థానాధీశుల సంచులు కప్పుకొని నిద్రపోతున్నది. లేకపోతే రైతు వ్యతిరేక నల్లచట్టాలను నిరసిస్తూ జరిగిన పోరాటాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలపై స్పందిస్తూ ‘ఇది మోదీ సర్కార్ భయానికి నిదర్శనం’ అని వ్యాఖ్యానించిన రాహుల్ గాంధీ, నేడు స్వంత పార్టీ సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల నుంచి విద్వేష ప్రసంగాల నివారణ పేరిట తెస్తున్న నల్లచట్టం నాటకాల వరకు అన్ని పాపాలకూ ఎలా చప్పట్లు కొడుతూ అండగా నిలువగలరు? ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దాల పాటు యుద్ధం చేసిన తెలంగాణలో ఇప్పుడు ‘మూతికి ముంత కట్టే కుట్రలు’ చేయడం దారుణం.
నిజానికి రెండున్నరేండ్లుగా ముఖ్యమంత్రి మొదలుకొని కొండా సురేఖ లాంటి క్యాబినెట్ మంత్రి, వీర్లపల్లి శంకర్, దానం నాగేందర్ లాంటి ఎంఎల్ఏలు వీధుల్లోనే కాదు..శాసనసభ సమావేశాల్లో కూడా ఎలా విద్వేష ప్రసంగాలు చేస్తూ బరితెగించి ప్రవర్తిస్తున్నారో రాష్ట్ర ప్రజానీకం గమనిస్తున్నారు.
రావులు, రెడ్లు, జాతి, కులం, లాగులు, తొండలు, తొక్కు, నారదీసుడు, బట్టలూడదీసుడు, పేగులు మెడలేసుకోవడం, నేతల చావును కోరుకోవడం ఇలా ఎంతో విద్వేషం స్వయానా సీఎం నోటి నుంచి నిత్యం మురుగు కాలువలా ప్రవహిస్తూనే ఉన్నది. బూతు భూతానికి హఠాత్తుగా బుద్ధి వచ్చినట్లుగా సర్కార్ ‘హేట్ స్పీచ్’ బిల్లును తెరపైకి ఎందుకు తెచ్చినట్లు?
వాస్తవానికి రెండున్నరేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అసమర్థత, అవినీతి వల్ల వివిధ వర్గాల భ్రమలన్నీ గాలిబుడగల్లా పేలిపోయాయి. స్కీములు ఆగి, స్కామ్‌లు పెరిగి పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రం సమస్యల వలయంలో సతమతమవుతున్నది. మరీ ముఖ్యంగా సునీల్ కనుగోలు టీం రెండున్నరేండ్ల క్రితం వదిలిన మాయామబ్బులను నమ్మి మోసపోయిన నవతరం సామాజిక మాధ్యమాల్లో సర్కార్‌పై నిప్పులు చెరుగుతున్నది. ఊరూరా యువలోకం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కనీవినీ ఎరుగని భాషలో కడిగిపారేస్తున్నది. ‘మేత’ మీడియాను కాపలా పెట్టుకున్నా, సామాన్యుడి సమాచార అస్త్రంగా మారిన సెల్‌ఫోన్ మీడియా సర్కార్‌కు ప్రాణ సంకటంగా మారిపోయింది. లక్షలాది ‘జెన్ జీ’ తరం చాట్‌లో నిప్పులు పోసుకొని చెరిగినట్లు కాంగ్రెస్ సర్కార్‌ను నిత్యం ప్రశ్నలతో నిలదీస్తున్నారు. ఈ తీవ్రమైన ముప్పు నుంచి తప్పించుకోవడానికి జైళ్ల బూచి చూపి జెన్ జీ గొంతు నొక్కేందుకే ‘హేట్ స్పీచ్’ బిల్లు బాగోతానికి ప్రభుత్వం తెగబడుతున్నది. జెన్ జీకి, జనానికి జడిసి జైళ్ల జపమాల జపిస్తున్నది. భయంతో బొక్కబోర్లా పడే పనిచేస్తున్నది. కర్మ ఎవరినీ ఊరికే వదలిపెట్టదన్నట్లు రేవంత్ పరివారం నమ్ముకున్న విద్యే వికటించి వారికి విషవలయంగా మారింది.
తెలంగాణ స్వప్నాన్ని వాస్తవం చేసేందుకు సవాళ్ల సమరం చేసిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎంత విద్వేషం వెళ్లగక్కారు? కేసీఆర్ నుంచి అభంశుభం ఎరుగని వారి మనుమడి వరకు ఎవరినీ వదలకుండా ఎంతెంత విద్వేషం వ్యాప్తిజేశారు? కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలు ఆడుతున్న విషక్రీడపై ప్రభుత్వం చట్టపరిధిలో చర్యలు తీసుకున్నా జైళ్లు నిండిపోయేవి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం విద్వేషంపై కాలాన్ని వెచ్చించకుండా కరవును తరిమేసేందుకే సర్వశక్తులు ఒడ్డి పోరాడింది.
యూత్ డిక్లరేషన్ ఎండమావిగా తేలిపోయిన తర్వాత ఉద్యోగమే కాదు.. విద్యనూ నాశనం చేస్తుంటే నవతరం నిలదీయకుండా ఉం టుందా? ఫ్లైట్ మోడ్‌లో కాలం గడుపుతున్న సీఎం..సొమ్ములు తరలించే కార్గో విమానంలా సర్కార్‌ను మార్చేశారని జెన్ జీ దునుమాడుతున్నది. వాట్సప్ గ్రూపుల్లో గ్యారెంటీలపైనే కాదు..సీఎం, మంత్రుల కుంభకోణాలన్నింటిపై తీవ్రమైన చర్చ జరుగుతున్న సమాచారాన్ని సర్కార్ సారథులకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ వివరించడం వల్లే గొంతునొక్కే సరికొత్త బిల్లు ‘హేట్ స్పీచ్’ను తెరమీదకు తీసుకొచ్చారు.
సోషల్ మీడియా స్వేచ్ఛపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో 19 (1) (ఏ) ఆర్టికల్, 2001 ఐటీ చట్టం, 2023లో జరిగిన సవరణలు, శ్రేయ సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో న్యాయస్థానం తీర్పు, గ్రీవెన్స్ అప్పిలేట్ అథారిటీ ఏర్పాటు, కర్ణాటక సర్కార్ సోషల్ మీడియా నియంత్రణ ప్రయత్నం తదితర అంశాలు సమాజంలో వైవిధ్యమైన చర్చ పెట్టాయి.
అవన్నీ ఎలా ఉన్నా సోషల్ మీడియా స్వేచ్ఛను కాపాడుకుంటూనే దానిని ‘హేట్ స్పీచ్’కు వదిలేయరాదనేది కూడా వాస్తవమే. అందుకే రాష్ట్రంలోని ‘హేట్ స్పీచ్’ సర్కార్‌ను గద్దె దింపేదాకా అన్ని వర్గాలు పోరాడక తప్పదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐరిష్ రచయిత, కవి ఆస్కార్ వైల్డ్ ‘ప్రపంచంలో సజీవంగా ఉండటం అపురూపం. కానీ కొందరు కేవలం బతికి ఉంటారంతే‘ అన్నట్లు రేవంత్‌రెడ్డి సర్కార్ కూడా కేవలం బతికి ఉందంతే..అయితే, మిగిలిన రెండున్నరేండ్లలో కాలం ఇంతకన్నా వేరేరకంగా ఉంటుందా ?
ఊరూరా యువలోకం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కనీవినీ ఎరుగని భాషలో కడిగిపారేస్తున్నది. ‘మేత’ మీడియాను కాపలా పెట్టుకున్నా, సామాన్యుడి సమాచార అస్త్రంగా మారిన సెల్‌ఫోన్ మీడియా సర్కార్‌కు ప్రాణ సంకటంగా మారిపోయింది. లక్షలాది ‘జెన్ జీ’ తరం చాట్‌లో నిప్పులు పోసుకొని చెరిగినట్లు కాంగ్రెస్ సర్కార్‌ను నిత్యం ప్రశ్నలతో నిలదీస్తున్నారు. ఈ తీవ్రమైన ముప్పు నుంచి తప్పించుకోవడానికి జైళ్ల బూచి చూపి జెన్ జీ గొంతు నొక్కేందుకే ‘హేట్ స్పీచ్’ బిల్లు బాగోతానికి ప్రభుత్వం తెగబడుతున్నది. జెన్ జీకి, జనానికి జడిసి జైళ్ల జపమాల జపిస్తున్నది. భయంతో బొక్కబోర్లా పడే పనిచేస్తున్నది. కర్మ ఎవరినీ ఊరికే వదలిపెట్టదన్నట్లు రేవంత్ పరివారం నమ్ముకున్న విద్యే వికటించి వారికి విషవలయంగా మారింది.