హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : రైతులకు యూరియా అందించడంలో విఫలం, గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో వైఫల్యం, జాబ్ క్యాలెండర్ అమల్లో, నోటిఫికేషన్లు ఇవ్వడంలో విఫలం, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల్లో విఫలం, గురుకుల భవనాలకు అద్దె చెల్లించడంలో విఫలం, ఆరు గ్యారెంటీల అమల్లో విఫలం, సన్నాలకు బోనస్ ఇవ్వడంలో, పెట్టుబడి సాయం అందించడంలో, నూతన వధువులకు తులం బంగారం ఇవ్వడంలో, మహిళలకు నెలకు రూ.2,500 చెల్లించడంలో.. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను లెక్కిస్తే చాంతాడంత జాబితా తయారవుతుంది. ఒకవైపు పాలనాపరంగా విఫలం కావడం, మరోవైపు ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహం.. ఈ నేపథ్యంలో అందరి దృష్టిని మళ్లించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వేసిన డైవర్షన్ డ్రామా బీసీ రిజర్వేషన్ల పెంపు! రాష్ట్రపతి వద్ద, గవర్నర్ వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉండగా రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదని ఎంతమంది చెప్పినా వినకుండా, మొండికిపోయారని అధికార పార్టీ నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. జీవో- 9 నిలబడదని ఎన్నివిధాలా నచ్చజెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తీరా పాత వైఫల్యాలను కప్పిపుచ్చుకోబోయి, ఇప్పుడు కొత్త సమస్యను కొని తెచ్చుకున్నామని కాంగ్రెస్ వర్గాలే ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. బీసీలకు జరిగిన ఈ ద్రోహానికి పూర్తి దోషం సీంఎ రేవంత్‌రెడ్డిదే అని స్పష్టంచేస్తున్నారు.
రాష్ట్రంలో రెండేండ్లుగా వైఫల్యాల పాలన కొనసాగుతున్నది. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు. తాజాగా యూరియా కొరత తీవ్ర సమస్యగా మారింది. ప్రతి పల్లెలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రేయింబవళ్లు క్యూలో నిలబడి, చెప్పులను లైన్లలో నిలబెడుతూ నరకం అనుభవిస్తున్నారు. కొన్నిచోట్ల అన్నదాతలపై పోలీసులు చేయిచేసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇదే సమయంలో భారీ వర్షాలు పంటలను దెబ్బతీశాయి. దీంతో రైతులు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు విషయంలో ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. కాలేజీలకు సుమారు రూ.10 వేల కోట్ల వరకు బకాయిలు ఉన్నట్టు సమాచారం. దీంతో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల అసోసియేషన్లు కాలేజీలు మూసివేస్తామని హెచ్చరికలు జారీచేశాయి. గురుకులాల భవనాలకు అద్దె చెల్లించకపోవడంతో తాళాలు వేస్తున్న దుస్థితి. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకల ఆరోపణలతో హైకోర్టు ఏకంగా మెయిన్స్ రిజల్ట్స్, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనికితోడు జాబ్ క్యాలెండర్ పేరుతో హడావుడి చేసి, నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతో నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి బీసీ రిజర్వేషన్ల డ్రామాను తెరమీదికి తెచ్చారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, కేవలం రాజకీయ లక్ష్యంతోనే అడ్డగోలుగా జీవోను విడుదల చేసిందని విమర్శిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు జీవో-9 ను సిద్ధం చేస్తున్న సమయంలోనే అనేక అభ్యంతరాలు వ్యక్తమైనట్టు సమాచారం. సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ జీవోపై ఆందోళన వ్యక్తం చేసి, వద్దు అని సూచించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. న్యాయ నిపుణులు సైతం ఈ జీవో న్యాయస్థానాల్లో నిలువదని స్పష్టంచేశారట. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) వర్గాలు సైతం ఇలాంటి అసంపూర్తి జీవో ఆధారంగా రిజర్వేషన్లు పెంచి, ఎన్నికలు నిర్వహిస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించాయని తెలిసింది. అయినా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదని, అంతా మా ఇష్టం అనే తరహాలో ముందుకు సాగిందని సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి. హైకోర్టు స్టే ఇవ్వడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వం తమకు నమ్మకద్రోహం చేసిందని బీసీలు మండిపడుతున్నారు. ఇది ప్రభుత్వ అహంకారాన్ని, సలహాలను స్వీకరించని మనస్తత్వాన్ని తెలియజేస్తున్నదని రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. ‘పొలిటికల్ మోటివ్‌తోనే తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారు. ఐఏఎస్‌ల సూచనలను, న్యాయపరమైన హెచ్చరికలను పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రజాధనం వృథా అయింది. స్టే వచ్చాక అంతా వృథా. ఓటర్ల జాబితాలు, నామినేషన్ పత్రాలు, శిక్షణలు వంటివి మళ్లీ చేయాల్సి వస్తుంది’ అని విమర్శిస్తున్నారు.