హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): వ్యక్తిగతంగా ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో లొంగిపోవల్సి వచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, దక్షిణ బస్త్ డీవీసీ ఇన్చార్జి కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్ చెప్పారు. మావోయిస్టుల లొంగుబాట్లపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి, ఈ మార్పులకు అనుగుణంగా పార్టీ పాలసీలను రూపొందించుకొని, ఎత్తుగడలను అనుసరించడంలో సమస్య ఉందని తెలిపారు.
డీజీపీ బీ శివధర్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు కుంకటి వెంకటయ్య, మొగిలిచర్ల వెంకట్రాజు అలియాస్ చందు, తోడెం గంగ అలియాస్ సోనీ లొంగిపోయారు. ఈ సందర్భంగా మీడియాతో వెంకటయ్య మాట్లాడారు. పార్టీ సిద్ధాంతంపై కూడా అభిప్రాయభేదాలు ఉన్నాయని చెప్పారు. ఎన్కౌంటర్ల కారణంగా పార్టీ కూడా నష్టపోయిందని చెప్పారు. తెలంగాణలో మావోయిస్టులు లొంగిపోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు.