ఆమనగల్లు, మార్చి 2 : రానున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు శంకరగిరి మాన్యాలే దిక్కని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పోనుగోటి అర్జున్‌రావు విమర్శించారు. ఆదివారం పట్టణంలోని మండల పరిషత్ ఆవరణలో ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహనికి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీకి చెందిన క్యాలెండర్, డైరీలను స్థానిక నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
అనంతరం పోనుగోటి అర్జున్ రావు మాట్లాడుతూ.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలకు మాయామాటలు చెప్పి.. అమలు కాని హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చడంలో మాత్రం పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వస్తే వాళ్లను చీపురుకట్టలతో తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసిగట్టుగా పనిచేసి రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగితే 15 నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని పోనుగోటి అర్జున్‌రావు అవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు అస్తవ్యస్తంగా మారాయని అన్నారు. ఇప్పటికే 50 మందికి పైగావిద్యార్థులు మరణించారని అన్నారు. అవి సాధారణ మరణాలు కావని ప్రభుత్వ హత్యలే అని ఆయన మండిపడ్డారు. ఇంత జరుగుతున్న గురుకులాల దుస్థితిపై సీఎం సమీక్ష పెట్టకపోవడం సిగ్గు చేటని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గండికోట శంకర్, మాజీ ఎంపీటీసీ దోనాదుల కుమార్, ఉప అధ్యక్షుడు పరమేష్, సీనియర్ నాయకులు శ్రీను నాయక్, పంతు నాయక్, వెంకటయ్య, లక్ష్మణ్, వెంకటయ్య, కుమార్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.