నార్నూర్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై గ్రామసభ ( Gram Sabha ) లో రెండు జాతీయ పార్టీల నాయకులు వాగ్వాదానికి దిగారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్( Narnoor ) మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో సర్పంచ్ బానోత్ కావేరి అధ్యక్షతన గ్రామసభను సోమవారం నిర్వహించారు. ఈ సభకు పాలకవర్గంతోపాటు కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగిస్తూ తీర్మానించాలని కాంగ్రెస్ నాయకులు కోరాగా బీజేపీ మండల అధ్యక్షుడు బిక్కు రాథోడ్, కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నార్నూర్ పంచాయతీకి ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారని నిలదీశారు. అర్హులైన వారు ఎక్కడికి వెళ్లాలని నిలదీయడంతో వాగ్వాదం తీవ్ర స్థాయికి వెళ్లింది. దీంతో ఎలాంటి అంశాలపై చర్చించకుండానే గ్రామసభను ముగించారు.
అర్హులైన వారు సర్పంచ్ వద్దకు వెళ్లి తమకు ఇళ్లు లేవంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ గ్రామసభలో ఉపసర్పంచ్ మహ్మద్ ఖురేషి, పంచాయతీ కార్యదర్శి మోతిరామ్, మాజీ జడ్పీటీసీలు హేమలత బ్రిజ్జిలాల్, రూపవతి జ్ఞానోబా పుష్కర్ ,లోకండే దేవ్ రావ్, రాథోడ్ బిక్కు, పాలకవర్గం సభ్యులు తదితరులు ఉన్నారు.