తిరుమల : 77వ గణతంత్ర దినోత్సవం (Republic Day) సందర్భంగా, టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ( Chairman BR Naidu) సోమవారం తిరుమలలోని తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు సదాశివరావు, నరేష్ కుమార్, శాంతారామ్, పనబాక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

తిరుమలలోని గోకులం అతిథి గృహంలో సోమవారం ఉదయం టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీలో వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తూ, భక్తులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని తెలిపారు.
టీటీడీ కూడా ఒక పురాతన, మహత్తర ధార్మిక సంస్థగా కాలానుగుణంగా తన వ్యవస్థలను పునఃపరిశీలిస్తూ, భక్తుల అవసరాలకు అనుగుణంగా సంస్కరణలు చేపడుతోందని చెప్పారు. ఒకటిన్నర సంవత్సరాల్లో టీటీడీలో అన్నప్రసాద విభాగం పాలసీలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. కాటేజ్ డొనేషన్ స్కీమ్ లో సమగ్ర పాలసీ తీసుకురావడానికి విశేష కృషి చేశామని తెలిపారు.