హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 30 : ప్రజలు మార్పు కోరుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజల తిప్పలు తప్పడంలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ప్రయాణికులకు శాపంగా మారింది. హనుమకొండలోని కాంగ్రెస్ భవన్ రోడ్లో ప్రయాణికులు జర భద్రంగా వెళ్లాల్సి వస్తుంది.
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రోడ్డు గుంతలు పడి అధ్వానంగా తయారైంది. ప్రమాదకరంగా ఏర్పడిన గుంతలో ప్రయాణికులు పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. దీంతో స్పందించిన స్థానికులు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అడ్డుగా బండరాళ్లు పెట్టారు. రోడ్డు మొత్తం గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. పలుమార్లు ఎమ్మెల్యేకు విన్నవించినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ఎమ్మెల్యే స్పందించి నూతనంగా రోడ్డు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.