నిజామాబాదు, ఫిబ్రవరి 01 : జిల్లా సరిహద్దు ప్రాంతమైన బోధన్ మండలంలోని సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విధుల్లో లేకుండా గైర్హాజర్ అయిన సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్‌ను సస్పెండ్ చేశారు.
అదేవిధంగా పీహెచ్సీలో అందుబాటులో లేని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ప్రమీలను వివరణ కోరుతూ ఛార్జ్ మెమో జారీ చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. పీహెచ్‌సీలోని ఆయా విభాగాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రతి రోజు ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్లు ఎంత మంది వస్తున్నారు, మందులు అందుబాటులో ఉన్నాయా, కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పీహెచ్ సీలోని హాజరు పట్టికను తెప్పించుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్, సీ హెచ్ ఓ ప్రమీల విధులకు హాజరైనట్టు అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్నప్పటికీ వారు విధుల్లో అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు ఆయన సాలూర చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ సెంటర్ ను పరిశీలించారు.