ఖమ్మం, డిసెంబర్ 15 : జిల్లాలో ఈ నెల 17న జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. ఏనూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి మండలాల పరిధిలో ఉన్న 191 గ్రామ పంచాయతీలు, 1,742 వార్డులకు మూడో విడత ఎన్నికల నిర్వహణకు గతంలో నోటిఫికేషన్ జారీ చేసి, నామినేషన్లు స్వీకరించినట్లు తెలిపారు. మూడో విడతలో ఒక పంచాయతీ, 9 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదని, 22 పంచాయతీలు, 361 వార్డులు ఏకగ్రీవమైనట్లు పేర్కొన్నారు.
మిగిలిన 168 పంచాయతీలకు మొత్తం 485 మంది సర్పంచ్‌లుగా, 1,372 వార్డులకు మొత్తం 3,369 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని తెలిపారు. 2,091 బ్యాలెట్ బాక్సులు, 2,092 పోలింగ్ అధికారులు, 2,637 మంది వోపీవోలను సిద్ధం చేశామని పేర్కొన్నారు. 31 లొకేషన్స్‌లో 318 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, అకడ సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 2,44,283 మంది ఓటర్లు తమ ఓటు హకు వినియోగించుకోనున్నారని, ఇందులో 1,18, 900 మంది పురుషులు, 1,25,380 మంది మహిళలు, ఇతరులు ముగ్గురు ఉన్నట్లు తెలిపారు.