గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విస్తరించాలని కొంతకాలంగా మీడియాకు లీకుల ద్వారా అనధికారిక ప్రకటనలు చేసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్నంత పని చేసింది. ముందస్తు కసరత్తు, క్షేత్రస్థాయి పరిశీలన, శాస్త్రీయ అధ్యయనం లేకుండానే గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్లతో పాటు శివారులోని 598 కౌన్సిలర్ కార్పొరేటర్ స్థానాలున్న 27 మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్లను 53 డివిజన్లుగా ఏర్పాటు చేస్తూ రాత్రికి రాత్రి విస్తరణ జీవోలు, డ్రాఫ్ట్ గెజిట్- 1167 జారీ చేసింది. దీంతో కేవలం 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జీహెచ్ఎంసీ పరిధి అదనంగా 1332.9 పెరిగి సుమారు 1982.9 చ.కి.మీకు విస్తరిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇది చాలా అనైతికమైన, అశాస్త్రీయమైన నిర్ణయం.
తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ మహానగరంపై మోదీ, చంద్రబాబు కండ్లు పడ్డాయి. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేందుకు రేవంత్ గురువు చంద్రబాబు, రేవంత్ బడేభాయ్ మోదీ కుట్రలు చేస్తున్నారు. ఇద్దరు కుట్రలకు రేవంత్‌ను పావుగా వాడుకుంటున్నారు. వారి కుట్రలకు తలొగ్గిన రేవంత్‌రెడ్డి హైదరాబాద్ విస్తరణ పేరుతో కొంతకాలంగా ప్రక్రియకు పూనుకున్నారు.
సాధారణంగా జీహెచ్ఎంసీ విస్తరించాలి అనుకుంటే ప్రభుత్వం ముందస్తుగా ఎక్కడ నుంచి ఎక్కడి వరకు విస్తరించాలి. కలుస్తున్న ప్రజల జీవనాధారం, ప్రమాణాలు, ప్రజలపైపడే అదనపు భారం, మౌలిక వసతులు ఏస్థాయిలో ఉన్నాయి అనే విషయంతోపాటు ప్రజల, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకోవాలి. గతంలో మంత్రుల కమిటీ వేశారు. వాళ్లు మీటిం గ్ పెట్టింది లేదు, అభిప్రాయాలు తీసుకున్నదీ లేదు. వాళ్లేమి నివేదిక ఇచ్చారో ప్రజలకే కాదు, అధికారులకూ తెలియకపోవడం శోచనీయం.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌ను ఏ ప్రాతిపదికన విస్తరిస్తున్నారో కూడా బహిర్గతపర్చడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన సకల జనుల సర్వేను ప్రామాణికంగా తీసుకున్నారా? లేదంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిన జనాభా సర్వేను ప్రామాణికంగా తీసుకున్నారా? 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకున్నా రా? ఓటర్లను ప్రామాణికంగా తీసుకున్నారా? అనే విషయాలపై గోప్యత ఎందుకు? జీహెచ్ఎంసీ విస్తరణపై ఫైనల్ నోటిఫికేషన్, తుది గెజిట్ విడుదల చేయకుండానే వార్డుల విభజన చేయాల్సిన ఆవశ్యకత ఏమున్నదో స్పష్టత ఇవ్వడం లేదు. స్థానిక మున్సిపల్ కమిషనర్ల నుంచి సమాచారం తీసుకుంటున్నారు కానీ, తీసుకుంటున్న వ్యక్తి ఎవరో కూడా కమిషనర్లకు చెప్పడం లేదట. పూర్తిగా ప్రజల పన్నులతో పాలన నిర్వహించే పురపాలికను విస్తరించే వ్యవహారంలో అంత గోప్యత దేనికి. వార్డుల విభజనకు సంబంధించి అధికారులకు కూడా కనీసం మ్యాపులు ఇవ్వడం లేదంటే దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏమిటి?
మాజీ సీఎం కేసీఆర్ పదేండ్ల పాలనలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేశారు. స్థానికసంస్థలను బలోపేతం చేశారు. పాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. అభివృద్ధి వికేంద్రీకరణతో దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా తెలంగాణ ఆవిష్కృతమైంది. అభివృద్ధికి నమూనాగా మారింది.
కేసీఆర్ హయాంలో హైదరాబాద్ మహానగరం బ్రాండ్ వ్యాల్యూ తగ్గకుండా బృహత్తర ప్రణాళికలు అమలు చేశారు. స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా తక్కువ కాలంలోనే 36 ఫ్లైఓవర్లను నిర్మించారు. ప్రపంచస్థాయి శాంతిభద్రతల కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్, అమెరికా వైట్‌హౌస్‌ను తలపించేలా సచివాలయం, టీహబ్, తీగల వంతెన, చెరువుల సుందరీకరణతో పాటు విద్య, వైద్యం, ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలకు శ్రీకారం చుట్టారు.
హైదరాబాద్‌లో ఏ రోడ్డు వెంట వెళ్లినా కేసీఆర్ చేసిన పనులు స్వాగతం పలుకుతాయి. కేసీఆర్ సారథ్యంలో అమలు చేసిన అభివృద్ధి సంస్కరణల ఫలితంగా హైదరాబాద్ దేశంలోనే ది బెస్ట్ లివబుల్ సిటీగా కీర్తి పొందింది. దేశ జీడీపీలో హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఐటీ ఉత్పత్తుల్లో అగ్రగామిగా నిలిచింది. తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలుపడంతో పాటు హైదరాబాద్ ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది.
వాస్తవానికి హైదరాబాద్ ఒక చారిత్రక నగరం. దక్కన్ పీఠభూమిలో ఉన్న హైదరాబాద్ సురక్షితమైన ప్రాంతం. అందుకే రక్షణశాఖకు సంబంధించిన డీఆర్డీఎల్ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ), బీడీఎల్ (భారత్ డైనమిక్ లిమిటెడ్, ఏవోసీ (ఇండియన్ ఆర్మీ ఆర్డినెన్స్ కాప్స్), ఈసీఐఎల్‌తో పాటు ఎన్ఎఫ్సీ, ఎఫ్‌సీఐ వంటి ముఖ్యమైన సంస్థలు ఇక్కడే ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నిజాం సహకారంతో బ్రిటిష్ వారు హైదరాబాద్‌ను సైనిక స్థావరంగా వాడుకున్నారు. అందులో భాగంగానే యుద్ధ సామగ్రి తరలింపు, భద్రపర్చేందుకు హకీంపేట్ ఎయిర్‌పోర్టును స్థాపించారు. దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందే హైదరాబాద్ రాష్ట్రంలో అసెంబ్లీ భవనం, ఓయూ, ఉస్మానియా దవాఖాన, హైకోర్టు, విమానాశ్రయం, కంటోన్మెంట్, అతిథి భవనాలు, డ్రైనేజీ వ్యవస్థ, నిరంతర తాగునీటి వ్యవస్థ, సిమెంట్ రోడ్లు, డబుల్ డెక్కర్ బస్సులు, డీజిల్ రైళ్లు, రేడియో స్టేషన్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒక పార్లమెంట్ భవనం మినహా దేశానికి ఏమేమి కావాలో అన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయని సాక్షాత్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాడే ప్రకటించారు. ఇంత గొప్ప మహానగరం అభివృద్ధికి ఈ రోజు వరకు ఓ ప్రణాళికను ప్రకటించని రేవంత్ ప్రభుత్వం విస్తరణ ప్రక్రియను పరుగెత్తించడంలో పెద్ద కుట్ర దాగి ఉన్నది.
ఇటీవల క్రమం తప్పకుండా చంద్రబాబు, రహస్యంగా మోదీ, షాలను కలుస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ను దేశంలో పెద్ద నగరంగా ప్రొజెక్టు చేసి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి దేశ రెండో రాజధానిగా కేంద్రం చేతిలో పెట్టేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. రేవంత్ క్యాబినెట్‌లోని మంత్రులకు మోదీ, చంద్రబాబు కనుసన్నల్లో జరుగుతున్న కుట్రలు అర్థం కావడం లేదు. వాళ్లకు అర్థమయ్యేలోపు హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతంగా మారే అవకాశం ఉన్నది. పాలకులకు చేతనైతే ప్రజలకు పాలనా సౌలభ్యం పెంచాలిగానీ వ్యవస్థను మరింత దూరం చేయొద్దు. హైదరాబాద్ కాబోయే కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి రేవంత్ ఎలాంటి శాస్త్రీయ, క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే రాత్రికి రాత్రి జీవోలు, డ్రాఫ్ట్ గెజిట్లు జారీ చేసి కేంద్రానికి, చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చేందుకు కంకణబద్ధుడై పని చేస్తున్నాడు.
వాస్తవానికి దేశంలోని కొన్ని ప్రధాన నగరాలను పరిశీలిస్తే రాజధాని ఢిల్లీని పాలనా సౌలభ్యం కోసం మూడు కేంద్రాలుగా విభజించారు. ఒకప్పుడు ఐదు నగరాలుగా ఉండేది. ప్రస్తుతం 1. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ, 2.న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్, 3.ఢిల్లీ కంటోన్మెంట్ గా ఏర్పాటు చేశారు. అలాగే దేశ ఆర్థిక రాజధానిగా భావించే మహారాష్ట్ర రాజధాని ముంబైని రెండు పరిపాలన (1. బ్రిహాన్ (గ్రేటర్) ముంబై మున్సిపల్ కార్పొరేషన్. 2. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) కేంద్రాలుగా విభజించారు. అంతెందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక రాజధాని బెంగళూర్‌ను సెప్టెంబర్‌లో సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ఐదు (1. బెంగళూరు ఈస్ట్. 2. బెంగళూరు నార్త్. 3.బెంగళూరు వెస్ట్. 4.బెంగళూరు సౌత్. 5.బెంగళూరు సెంట్రల్) కేంద్రాలుగా ఏర్పాటు చేసి గ్రేటర్ బెంగళూరు అథారిటీ పరిధిలోకి తీసుకువచ్చింది. 1480 చ.కి.మీ విస్తీర్ణం గల కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జనసాంద్రతను 144 డివిజన్లుగా ఏర్పాటు చేశారు. 426 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో 200 డివిజన్లు ఏర్పాటు చేసి ప్రజా ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించారు. అలాగే పరిశుభ్రతకు, అభివృద్ధికి చిరునామాగా భావించే ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 530 చదరపు కిలోమీటర్లు కాగా, 85 మున్సిపల్ డివిజన్లను అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇలా హైదరాబాద్‌ను విస్తరించాలి
అనుకున్నప్పుడు రేవంత్ ప్రభుత్వం కనీసం ప్రధాన నగరాల్లోనైనా అధ్యయనం చేయాలి? వాస్తవానికి హైదరాబాద్ మహా నగరం కూడా దేశంలోనే అతిపెద్ద నగరం కాబట్టి ఢిల్లీ, బెంగళూరు తరహాలో జీహెచ్ఎంసీని ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, సెంట్రల్ ఇలా ఐదు కార్పొరేషన్లు ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పవర్ సెంట్రిక్ కోసం ప్రజల అభీష్టాలకు విరుద్ధంగా, అశాస్త్రీయంగా వార్డుల విభజన చేసి జీహెచ్ఎంసీని 300 వార్డులతో పెద్ద నగరంగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ప్రజలపై పన్నుల భారం పడుతుంది.
పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు తగ్గుతాయి. ప్రస్తుతం నగరీకరణ చెందుతున్న ప్రాంతాలను ఇప్పటికే అభివృద్ధి అయిన నగరంలో కలపడంతో శివారు ప్రాంతాల్లో అభివృ ద్ధి కుంటుపడుతుంది. జీహెచ్ఎంసీ విస్తరణ నిర్ణ యం ప్రజల మేలుకోసం కాదు. చంద్రబాబు, మో దీని సంతృప్తిపరిచేందుకు, పవర్ సెంట్రిక్ పాలన కోసం రేవంత్ తెలంగాణ ప్రజలకు చేస్తున్న మో సం. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు మానుకోవాలి. శివారు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అలాగే కొనసాగించాలి. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలి.
వ్యాసకర్త: మాజీ మేయర్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్జక్క వెంకట్ రెడ్డి