ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే ఓ సింహాన్ని తెరమీదకు తెచ్చారు. యంత్రభాగాలతో నిండిన లోహపు సింహం బొమ్మను ‘మేక్ ఇన్ ఇండియా’కు ప్రతీకగా రూపొందించారు. భారత స్వదేశీ తయారీ రంగాన్ని ఉరుకులు పరుగుల మీద ఉద్ధరిస్తామనేది దాని వెనుకనున్న ఉద్దేశం. నిజానికి అది పూర్తిగా ఎన్డీయే సర్కారు ఊహించి, రూపొందించిన కార్యక్రమం కూడా కాదు. అంతకుముందే మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన జాతీయ ఉత్పాదకత కార్యక్రమానికి రంగులు, హంగులు కలిపి అట్టహాసం చేశారు. మోదీ మూడోవిడత అధికారం చేపట్టి అప్పుడే ఏడాది దాటింది. ఈ పదకొండేండ్ల కాలంలో ఆ సింహం గర్జించలేకపోయింది. పైగా పారిశ్రామిక వృద్ధికి ఊతమివ్వాల్సిన కార్యక్రమం వృద్ధిని స్తంభింపజేయడమే కాకుండా కుంచించుకుపోయేలా చేసింది. దేశ జీడీపీలో ఉత్పాదకరంగం వాటాను 16 శాతం నుంచి 2022 నాటికి 25 శాతానికి పెంచుతామని గొప్పలు చెప్పుకున్నారు.
కార్యక్రమానికి బ్రాండింగ్ బాగానే చేశారు కానీ క్షేత్రస్థాయిలో ఫలితాలు సాధించలేక అది చతికిల బడింది. 2022లో పథకం అతీగతీ లేకుండా ఉండిపోవడంతో గడువును 2025కు పొడిగించారు. అంతిమంగా మాటలకూ, చేతలకూ పొంతన లేకుండా పోయింది. జీడీపీలో ఉత్పాదకరంగం వాటా పెరగడం అటుంచి 2023-24లో 13 శాతానికి పడిపోయింది. ఉపాధి కల్పన మరీ దారుణం. 2016-17లో ఉత్పాదక రంగం ఉద్యోగాలు 5.1 కోట్ల నుండి 2020-21లో 2.7 కోట్లకు, అంటే సగానికి పడిపోవడం కార్యక్రమం ఘోరవైఫల్యానికి అద్దం పడుతున్నది. ఆర్థికవ్యూహం స్థానంలో కాకమ్మ కబుర్లు, ఆచరణీయత స్థానంలో జిమ్మిక్కులు, నినాదాలు జొరబడితే జరిగే దుష్ఫలితాలు ఎలా ఉంటాయో ఇది తెలియజేస్తున్నది. నోట్ల రద్దు వంటి అనాలోచిత నిర్ణయం చిన్న, మధ్యతరహా పరిశ్రమల నడ్డి విరిచింది. ఉత్పాదక రంగం వెనుకబాటు వల్ల దిగుమతులు చేసుకోక తప్పని పరిస్థితిలో పడిపోయాం.
విదేశీ పెట్టుబడులు ఎగిరిపోతున్నాయి. రూపాయి రోజురోజుకూ పాతాళానికి పల్టీ కొడుతున్నది. ‘అరయంగా కర్ణుడీల్గె ఆర్గురి చేతన్’ అన్నట్టు రకరకాల కారణాల వల్ల ఇవాళ భారత తయారీ రంగం మూలకు పడి మూల్గుతున్నది. కనీసం విమానాశ్రయాల్లో ఉపయోగించే ట్రాలీలను సైతం దేశం సొంతంగా తయారు చేసుకోలేని దీనస్థితిలోకి నెట్టివేయబడింది. ప్రధాని ఆర్భాటంగా ప్రారంభించే వందేభారత్ రైళ్ల చక్రాలు చైనా నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి వాటి సరఫరా నిలిచిపోతే మనం పొరుగుదేశం వైపు మళ్లాం కానీ ఇక్కడ తయారు చేయడం గురించి ఆలోచించలేకపోయాం. మరోవైపు నిరుద్యోగం పెరిగిపోయి ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోతున్నాయి. అనేక అంతర్జాతీయ సూచీల్లో భారత్ అట్టడుగుకు చేరుతుండటం మనం చూస్తున్నాం. లక్షల కోట్ల ఆర్థికవృద్ధి లక్ష్యాల గురించి ఊదరగొడుతున్నవారు దీనికి సమాధానం చెప్పాలి. కేంద్ర వైఫల్యానికి దేశం భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి రావడం విచారకరం.