హెరాల్డ్ రాబిన్స్ జీవించి లేడు గాని, ఉండి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమయంలో లియోనిల్ మెస్సీతో పాటు తనను కూడా హైదరాబాద్‌కు ఆహ్వానించి ఉండేవారు. రాష్ట్రంలో తన పాలనకు రెండేండ్లు పూర్తయి, యువతీ యువకులకు మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ దారుణంగా విఫలమైన స్థితిలో, ఆ యువతను మైమరిపించేందుకు మెస్సీకి మించిన సాధనం ఏముంటుంది? అదే పద్ధతిలో, హద్దులేని హామీలతో ప్రజలకు కలల స్వర్గాన్ని సృష్టించి గెలిచి, ఆ కలలు భంగపడిపోయిన వేళ, హెరాల్డ్ రాబిన్స్ వంటి స్వప్న ప్రపంచ చిత్రకారునికి మించిన అతిథి మరెవరు ఉండగలరు?
ఓరి దేవుడో! నాలుగు రోజులకొకటి చొప్పున ఈ మాటలు వింటుంటే కండ్లు తిరుగుతాయి, నవ్వూ ఆగదు. కొద్దిరోజుల కిందట ప్రపంచపటం ముందు నిలబడి ఇంకా మిగిలినవి ఏమైనా ఉన్నాయా అని వెతికితే ఏదీ కనిపించలేదు. ఆయా దేశాలు, నగరాలు ఆ స్థాయికి అభివృద్ధి చెందటం వెనుక ఏమేమి ఉన్నాయో, ఎంత కృషి ఉందో, అందుకు ఎన్ని దశాబ్దాలు తీసుకుందో రేఖామాత్రంగానైనా తెలిసినవారికి, ఇవన్నీ వట్టి ప్రగల్భపు మాటలని వెంటనే అర్థమవుతుంది. అందులోనూ ఈ పాలకుల తీరు, సమర్థతలు తెలిసినప్పుడు.
లాటిన్ అమెరికాలోని అర్జెంటీనా దేశానికి చెందిన లియోనిల్ మెస్సీ, మనం ఫుట్‌బాల్ అని పిలిచే సాకర్ క్రీడలో వర్తమాన కాలంలో మొత్తం ప్రపంచంలోనే అగ్రగణ్యుడు. ఆయన హైదరాబాద్ రానున్నాడన్న వార్తతో తెలంగాణ యువత మొత్తం మైమరిచిపోయింది. వంద కోట్ల ఖర్చుతో రేవంత్ రెడ్డి ఆశించింది సరిగా అదే. మెస్సీ రాక ముందు వెనుకలలో తెలంగాణ ఫుట్‌బాల్‌కు జరిగేదేమీ ఉండదని ఆయనకు తెలియనిది కాదు. కావలసింది, మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలన్న మాట రెండేండ్లు గడిచినా అందులో 10 శాతానికి కూడా చేరకపోవటంతో ఆగ్రహంగా ఉన్న యువతీయువకుల దృష్టిని మరల్చటం. ఈ లక్ష్యం నెరవేరుతుందా? అన్నది వేరే విషయం.
ఆహ్వానించటమైతే జరిగిపోగా, మీడియా ‘మెస్సీ మేనియా’గా అభివర్ణించింది చాలానే కన్పించింది. మెస్సీని కలిసేందుకు హైదరాబాద్‌కు ప్రత్యేకంగా వచ్చిన రాహుల్‌గాంధీ, ఒక్కసారి అశోక్‌నగర్ లైబ్రరీకి కూడా రాగలిగితే ఎంత బాగుండేది!
పోతే, అమెరికాకు చెందిన హెరాల్డ్ రాబిన్స్ 1949లో ‘ద డ్రీమ్ మర్చంట్స్’ అనే నవలతో ప్రసిద్ధుడయ్యాడు. మహా సంపన్నుడిగా మారిన ఒక పేద గ్రామీణుని కథ అది. నవలలోని ఇతివృత్తపు సందర్భం వేరైనా, ‘డ్రీమ్ మర్చంట్స్’ (కలల బేహారులు) అనే మాట మాత్రం అనేక సందర్భాలకు వర్తిస్తూ వస్తున్నది. మనుషుల, ముఖ్యంగా పేదల కలలను ఆధారం చేసుకుంటూ వాటితో వ్యాపారం చేయటమనే అర్థంలో. తెలంగాణ అసెంబ్లీకి జరిగిన 2023 ఎన్నికలలో పేదలను, దిగువ మధ్యతరగతిని ఆకర్షించేదుకు రేవంత్ రెడ్డి నుంచి మొదలుకొని జాతీయ కాంగ్రెస్ నాయకత్వం వరకు ఒక పథకం ప్రకారం చేసిన పని, అలవిగాని హామీలతో కలలను సృష్టించి, ఆ కలలతో రాజకీయ వ్యాపారం చేయటమే. యువతకు సంబంధించి ఉద్యోగాల హామీ వలెనే, ప్రజలకు సంబంధించిన చప్పన్నారు కలలు కూడా భంగపడిపోయాయి. అటువంటి స్థితిలో, యువతను మైమరిపించగలమన్న భ్రమతో కావచ్చు మెస్సీని రప్పించినట్టు, ప్రజల కలలను మరింతకాలం పొడిగించటం ఎట్లో తెలిపేందుకు హెరాల్డ్ రాబిన్స్‌ను పునర్జీవింపజేసి రప్పించగలిగితే రేవంత్ రెడ్డి సంతోషించేవారు.
వాస్తవానికి రెండేండ్ల పాలనను ఈ నెల 7వ తేదీ నాటికి పూర్తిచేసుకున్న ముఖ్యమంత్రి, ఈ కాలంలో సాధించినదేమిటో సాకల్యంగా సమీక్షించి ప్రజలకు తెలియజేయవలసిన సందర్భమిది. పదవీకాలం ఐదేండ్లయినప్పటికీ చివరి ఏడాది ఎన్నికల సన్నాహాలతో గడుస్తుంది గనుక ఆచరణాత్మకంగా చూసినప్పుడు రెండేండ్లు అన్నదే సగకాలం కింద లెక్కకు వస్తుంది. అందువల్ల, తమ పరిపాలనపై సీరియస్ సమీక్షకు, దానిని ప్రజల ముందు ఉంచేందుకు ఇది సరైన సమయం. చేసిన మంచిని వివరించటం, జరిగిన లోపాలను గుర్తించి సరిదిద్దుకోవటం, ఇంకా జరగవలసిన వాటిపై దృష్టిపెట్టడం ప్రభుత్వం వైపు నుంచి జరగాలి. అదేవిధంగా, ఈ రెండేండ్ల గురించి వివిధ వర్గాల ప్రజలు, పరిశీలకుల అభిప్రాయం ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించి అవసరమైన సవరణలు చేసుకోవాలి. కానీ, ఈ రెండింటిలో ఏదీ కన్పించటం లేదు.
తమ రెండేండ్ల పాలన ప్రజలకు సంతృప్తికరంగా ఉండే అవకాశం లేదని మాత్రం ముఖ్యమంత్రికి అర్థమైనట్టుంది. అర్థం కాకపోయేందుకు ఆయన తెలివి తక్కువవాడేమీ కాదు. పరిపాలన చేతకాకపోవచ్చు, మంచి చేయాలనే ఉద్దేశం కన్న స్వప్రయోజనాలు ఎక్కువ ఉండచ్చు. కానీ, మందబుద్ధి అనలేం. మెస్సీ ఫుట్‌వర్క్‌కు దీటుగా రాజకీయమైన ఫుట్‌వర్క్ చూపగలరు. అందువల్లనే, అమలులో విఫలమైన రెండేండ్ల హామీల స్థానంలో సరికొత్త కలల ప్రపంచాన్ని సృష్టించే పని మొదలుపెట్టారు. ఆ కలల బేహారీ తంత్రంలో తాజాది ‘క్యూర్.. ప్యూర్… రేర్…’. హెరాల్డ్ రాబిన్స్ పునర్జీవించి వచ్చినా ఇంతకన్న అద్భుతమైన ఎత్తుగడ చెప్పి ఉండగలిగేవాడు కాదేమో. తెలంగాణ రైజింగ్, కొత్త పారిశ్రామిక విధానం, ఫ్యూచర్ సిటీ వగైరా పేర్లతో ఇటీవల వరుసగా ముందుకు తెస్తున్నవన్నీ కూడా ఈ కోవకు చెందినవే.
ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు. గత ఎన్నికల సమయంలో వివిధ రంగాలు, సామాజికవర్గాలను ఉద్దేశించి చేసిన డిక్లరేషన్లు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాలకు సంబంధించినవే అయినప్పుడు, వాటి అమలు అరకొరగానే ఉన్నప్పుడు, లేదా ఇంకా అసలు మొదలైనా కాని స్థితిలో, వాటిపై దృష్టి కేంద్రీకరించటానికి బదులు, ప్రజలకు కొత్త కలలను చూపటం ఎందుకని. మరీ ముఖ్యంగా పాతవి అమలుకావటం లేదన్న అసంతృప్తి ప్రజలలో, యువతరంలో పెరుగుతున్నప్పుడు. వెనుకటివి సంతృప్తికరంగా అమలుపరుస్తూ కొత్తవి పెడితే అది గొప్పగా ఉంటుంది. ప్రజలు ప్రశంసిస్తారు. అట్లా కానప్పుడు పాతవి మరపున పడకపోగా, వాటినుంచి దృష్టిని మరల్చటానికే కొత్త భ్రమలు సృష్టిస్తున్నారనే అభిప్రాయం ప్రజలకు ఏర్పడుతుంది.
యువతీ యువకులు, రెండు లక్షల ఉద్యోగాల మాట తమతో మరిపించేందుకే ఇప్పుడీ కొత్త కలల ప్రపంచంలో 5 లక్షల ఉద్యోగాలు, 13 లక్షల ఉద్యోగాలనే మంత్రదండాలతో తమను హిప్నటైజ్ చేయజూస్తున్నారనే భావనకు వస్తారు.
వాస్తవం ఏమంటే, గత ఎన్నికల హామీలను అమలు పరచలేమన్న విషయం కాంగ్రెస్ వారికి ముందే తెలుసు. గెలిచి అధికారానికి వచ్చినప్పుడు తెలుసు. తాము ప్రకటించిన గడువులు ముగిసినప్పుడు తెలుసు. ఇప్పుడు రెండేండ్లు గడిచిన స్థితిలోనూ తెలుసు. అయినప్పటికీ ఇంతకాలం, చేయని వాటిని కూడా ‘చేస్తాం, చేస్తాం, చేస్తున్నాం, చేస్తున్నాం’ అని బుకాయిస్తూ గడిపారు. ఆ మోసపు మాటలు ఇక చెల్లుబాటయే స్థితి లేదని అర్థమై కావచ్చు, కొత్త కలల సూపర్ బజార్లు తెరుస్తున్నారు. వెనుకటి వాటి అమలు సాధ్యం కాదని వారికి తెలియటమే గాక, అమలుచేసే ఉద్దేశమే అసలు మౌలికంగా లేదు. మోసగించి అధికారానికి రావటమే పరమోద్దేశం. ఈ కొత్త సూపర్ బజార్ల విషయం కూడా అంతే. ఇవన్నీ పరిపాలన మధ్యంతరంలో చేయజూస్తున్న రెండవ దశ కలల మోసాలు. వీటిని అమలుచేయలేమని, చేయటం తమకు సాధ్యం కాదని వారికి స్పష్టంగా తెలుసు. పైన పేర్కొన్న ఇటీవలి కాలపు ప్రతి ఒక్క ప్రణాళిక విషయమూ అంతే. ట్రిలియన్ ఎకానమీ మూడు ట్రిలియన్ల ఎకానమీ ప్ర పంచంతో పోటీ, జపాన్‌తో, చైనాతో, దక్షిణకొరియాతో, గ్వాంగ్ జుంగ్‌తో, టోక్యోతో, సియోల్‌తో, తైవాన్‌తో, లండన్‌తో, ప్యారిస్‌తో, బ్రస్సెల్తో, బీజింగ్‌తో, షాంఘైతో పోటీ.
ఓరి దేవుడో! నాలుగు రోజులకొకటి చొప్పున ఈ మాటలు వింటుంటే కండ్లు తిరుగుతాయి, నవ్వూ ఆగదు. కొద్దిరోజుల కిందట ప్రపంచపటం ముందు నిలబడి ఇంకా మిగిలినవి ఏమైనా ఉన్నాయా అని వెతికితే ఏదీ కనిపించలేదు. ఆయా దేశాలు, నగరాలు ఆ స్థాయికి అభివృద్ధి చెందటం వెనుక ఏమేమి ఉన్నాయో, ఎంత కృషి ఉందో, అందుకు ఎన్ని దశాబ్దాలు తీసుకుందో రేఖామాత్రంగానైనా తెలిసినవారికి, ఇవన్నీ వట్టి ప్రగల్భపు మాటలని వెంటనే అర్థమవుతుంది. అందులోనూ ఈ పాలకుల తీరు, సమర్థతలు తెలిసినప్పుడు.
ఇదంతా వదిలివేసి, రేవంత్ రెడ్డి పాలనకు మధ్యంతర కాలంలో నిలిచి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఒక్కొక్క పేజీగా తిరగవేసి చూస్తుంటే, జరుగుతున్న ఉల్లంఘనల తీరు ఎటువంటిదో ఎవరూ వివరించనక్కర లేకుండానే తెలిసిపోతుంది. మొత్తం 42 పేజీలలో, 7 విభాగాలుగా, ఒక గ్యారెంటీ కార్డుతో పాటు 5 డిక్లరేషన్లుగా, 37 అంశాలుగా, వాటికి అనేక ఉప అంశాలుగా, వీటన్నింటికి అదనంగా జాబ్ క్యాలెండర్ రూపంలో చెప్పినవాటిని చూసినప్పుడు, వీటి అమలుపై కనీసం అంతర్గతంగానైనా మధ్యంతర సమీక్షలు చేసుకునే సాహసం, నిజాయితీ ఈ ప్రభుత్వానికి ఉంటు ందని తోచటం లేదు. అవి లేని పాలకులు ఆత్మ వంచనలు చేసుకుంటూ పగటికలలు, దొంగ కలలు కనగలరే తప్ప, నిజమైన కలలు కూడా కనలేరు. జరుగుతున్నది అదేనని హెరాల్డ్ రాబిన్స్కు తెలుసు.
-టంకశాల అశోక్